ఏపీలో జనసేన, బీజేపీతో కలిసి కూటమిని ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు మూడు పార్టీలను విజయపథంలో నడిపించారు. తిరుగులేని మెజారిటీని సొంతం చేసుకొని రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈనెల 11 లేదంటే 12వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నిన్న ఢిల్లీలో ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో పాల్గొని నరేంద్రమోడీని మరోసారి ప్రధానమంత్రిగా ఎన్నుకునేందుకు అంగీకారం తెలిపారు. రేపు మరోసారి ఢిల్లీలోనే జరిగే ఎన్డీయే మిత్రుల సమావేశంలో ఎంపీలందరితో పాల్గొననున్నారు.
కీలకంగా మారిన చంద్రబాబు, నితీష్ లోక్ సభలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన 272 సీట్లను బీజేపీ సొంతంగా సాధించలేకపోయింది. కేవలం 240 దగ్గర ఆగిపోయింది. దీంతో చంద్రబాబుతోపాటు జేడీయూ నితీష్ కుమార్ ఎన్డీయేలో కీలకంగా మారారు. దీనికి సంబంధించి జాతీయ మీడియా విస్త్రత కథనాలను ప్రసారం చేసింది. 16 ఎంపీ సీట్లతో బీజేపీ తర్వాత రెండో అతి పెద్ద పార్టీగా అవతరించిన తెలుగుదేశం పార్టీ కేంద్రంలో సముచిత పదవులు ఇవ్వాలని, మొత్తం ఎనిమిది మంత్రి పదవులతోపాటు లోక్ సభ స్పీకర్ కూడా కావాలని కోరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
జేడీయూకు 3+1 ఆరోగ్య శాఖ, వ్యవసాయశాఖ, ఐటీ కమ్యూనికేషన్ల శాఖ, జలశక్తి శాఖ, విద్యాశాఖ, గ్రామీణాభివృద్ధి, హౌసింగ్, పట్టణాభివృద్ధి శాఖలతోపాటు స్పీకర్ పదవిని చంద్రబాబు అడుగుతున్నారు. 12 మంది ఎంపీలున్న జేడీయూ నాలుగు మంత్రి పదవులతోపాటు బీహార్ ప్రత్యేక హోదా, ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు అడుగుతున్నట్లు తెలుస్తోంది. ఫలితాలు వెల్లడికాకముందే మూడు మంత్రి పదవులు, ఒక సహాయ మంత్రి పదవి ఇస్తానని బీజేపీ హామీ ఇచ్చింది. నితీష్ కుమార్ కూడా రైల్వే శాఖతోపాటు గ్రామీణాభివృద్ధి, జలవనరులను అడుగుతున్నారు. మోడీ, షా ఏం చేస్తారో చూడాలి.








