ఏపీలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఓటరు నాడి ఎటువైపు ఉందనే అంశంపై నిన్న పలు ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. ఇందులో లోక్ సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఎన్డీయే కూటమివైపు మొగ్గారని దాదాపు అన్ని జాతీయ ఎగ్జిట్ పల్స్ తేల్చాయి. అయితే ఒక్క టైమ్స్ నౌ మాత్రమే లోక్ సభ పోరులో వైసీపీకి ఆధిక్యాన్ని కట్టబెట్టింది. అయితే అసెంబ్లీ ఎన్నికలపై మాత్రం నిన్న జాతీయ ఛానళ్లు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించలేదు. దీంతో ఉత్కంఠ మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో ఇండియా టుడే యాక్సెస్ మై ఇండియా ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏం జరిగిందో చెప్పేసింది.
ఏపీ అసెంబ్లీలోని 175 సీట్లకు జరిగిన ఎన్నికల్లో ఈసారి ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించబోతోందని ఇండియా టుడే-మై యాక్సెస్ ఇండియా తేల్చింది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి 98 నుంచి 120 సీట్లు లభిస్తాయని ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. వైసీపీకి మాత్రం 55-77 సీట్లు లభించే అవకాశం ఉందని తేల్చింది. అంటే దాదాపు 50 సీట్ల తేడాతో ఎన్డీయే కూటమి ఏపీలో అధికారాన్ని చేజిక్కించుకోబోతోందని ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ తేల్చింది.
ఎన్డీయే కూటమిలో భాగమైన టీడీపీకి ఈసారి 78-96 సీట్లు లభించే అవకాశముందని ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ తేల్చింది. అలాగే కూటమిలో మరో పార్టీ జనసేనకు 16-18 సీట్లు వస్తాయని తేలింది. బీజేపీకి 4-6 సీట్లు లభిస్తాయని తెలిపింది. ఇతరులకు అంటే కాంగ్రెస్ కు 0-2 సీట్లు లభిస్తాయని కూడా తెలిపింది.
రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి ఈసారి 44 శాతం ఓట్లు లభించాయని ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ తేల్చింది. టీడీపీకి 42 శాతం ఓట్లు, బీజేపీకి 2 శాతం ఓట్లు, జనసేనకు 7 శాతం ఓట్లు లభిస్తాయని ఈ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. కాంగ్రెస్ కు కూడా 2 శాతం ఓట్లు లభిస్తాయని తెలిపింది. ఇతరులకు 3 శాతం ఓట్లు లభించే అవకాశముందని వెల్లడించింది.