బెంగుళూరు రేవ్ పార్టీ వ్యవహారం సద్దుమణిగినట్టేనా? తొలి రెండు రోజులు నానా హంగామా చేశారు పోలీసులు. ఆ తర్వాత సైలెంట్ అయ్యారు. తాజాగా ఈ కేసులో పట్టుబడిన టాలీవుడ్ నటి హేమకు మరోసారి నోటీసులు ఇచ్చారు బెంగుళూరు పోలీసులు. జూన్ ఒకటిన విచారణకు రావాలని అందులో ప్రస్తావించారు. మరి ఈసారి తప్పకుండా ఆమె వెళ్తున్నారా? లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
తొలుత ఈనెల 27న విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చారు బెంగుళూరు పోలీసులు. అయితే వైరల్ ఫీవర్ కారణంగా రాలేనని లేఖ రావడంతో ఇప్పుడు మరోసారి నోటీసులు ఇచ్చారు. ఈ కేసులో మొత్తం 86 మందికి నోటీసులు ఇచ్చారు. అయితే ఒక్కరు కూడా విచారణకు హాజరుకాలేదు. అందరూ డుమ్మా కొట్టడం వెనుక కారణమేంటి? ఈ విషయంలో బెంగుళూరు పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదట. దీని వెనుక ఎవరైనా ఉన్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈసారి ఎంతమంది విచారణకు హాజరవుతారు? అనేది బిగ్ క్వశ్చన్ మార్క్. ఒకవేళ డుమ్మా కొట్టేవారి విషయంలో బెంగుళూరు పోలీసుల నెక్ట్స్ స్టెప్ ఎలా ఉండబోతోందనేది ఉత్కంట రేపుతోంది. దేశవ్యాప్తంగా సంచలనం రేపింది బెంగుళూరు రేప్ పార్టీ వ్యవహారం. పార్టీకి మొత్తం 150 మంది హాజరు కాగా, కేవలం 105 మందిని మాత్రమే పట్టుకున్నారు. వారందరికీ టెస్టు చేస్తే 86 డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది.
ఎక్కువ మోతాదులో డ్రగ్స్ తీసుకున్నవారు ఎనిమిది మంది ఉన్నారు. అందరూ విచారణకు డుమ్మా కొట్టారు. దాడుల సమయంలో మరికొందరు తప్పించుకుపోయారు. అయితే తప్పించుకున్న వారిలో ఎవరు ఉన్నారు? అనేది తెలియాలంటే నోటీసులు తీసుకున్నవారు హాజరైతేనే ఈ కేసు గుట్టు వీడుతుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.