ఏపీలో ఎన్నికల ఫలితం పై ఉత్కంఠ కొనసాగుతోంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. గెలుపు పైన వైసీపీ, టీడీపీ కూటమి ధీమా వ్యక్తం చేస్తున్నా..లోలోపల మాత్రం ఆందోళన కొనసాగుతోంది. జగన్ తాము 2019 కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామని ధీమాగా చెప్పుకొచ్చారు. విదేశీ పర్యటన నుంచి వచ్చిన చంద్రబాబు పార్టీ నేతలతో ఫలితాల పై చర్చించారు. జనసేనాని పవన్ తో చంద్రబాబు సమావేశం కానున్నారు. కూటమి గెలుపు ఖాయం అంటూనే..కొత్త లెక్కలు తెర మీదకు తెస్తున్నారు.
చంద్రబాబు అంచనాలు ఏపీలో ఈ సారి అధికారమే లక్ష్యంగా టీడీపీ కూటమి నేతలు పని చేసారు. పోలింగ్ సరళి తమకు అనుకూలంగా ఉందని లెక్కలు కడుతున్నారు. పోలింగ్ ముగిసిన తరువాత జగన్ 2019 ఎన్నికల కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామని చెప్పినా..కూటమి నేతలు ఖండించలేదు. గెలుపు పైన జగన్ స్థాయిలో ధీమా వ్యక్తం చేయలేదు. విదేశాలకు వెళ్లిన చంద్రబాబు తిరిగి వచ్చారు. రేపు అమరావతికి రానున్నారు. ఈ నెల 31న జనసేనాని పవన్ తో సమావేశం కానున్నారు. పోలింగ్ జరిగిన తీరు, అనంతరం జరిగిన పరిణామాలను ఇద్దరు నేతలు సమీక్షించనున్నారు.
చంద్రబాబు – పవన్ భేటీ ఇప్పటికే గెలుపు ఖాయమని కూటమి నేతలు చెబుతున్నా…వారిని ప్రదానమైన అంశం ఆందోళనగా మారింది. పెరిగిన పోలింగ్ శాతం గ్రామీణ ప్రాంతంలో..అందునా మహిళలదిగా నిర్ణారణ కావటంతో లోలోపల కొంత అంతర్మధనం చెందుతున్నట్లు తెలుస్తోంది. దీంతో..నియోజకవర్గాల వారీగా పోలింగ్ సరళి పైన ఆరా తీసారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటి 69 లక్షల మంది మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆ ఓట్ బ్యాంక్ తమదేనని వైసీపీ క్లెయిమ్ చేసుకుంటోంది.టీడీపీ అదంతా ప్రభుత్వ వ్యతిరేక ఓటుగా వాదిస్తోంది. పథకాల లబ్దిదారులు జగన్ కు మద్దతుగా నిలిచారనేది వైసీపీ నేతల విశ్లేషణ.
ఉమ్మడి కార్యాచరణ అయితే, పూర్తి స్థాయిలో మహిళా ఓట్ బ్యాంక్ వైసీపీకి వెళ్లలేదని టీడీపీ నేతలు లెక్కలు వేస్తున్నారు. టీడీపీ కూటమి నేతలు ఇప్పటి వరకు గెలుపు పైన ధీమా వ్యక్తం చేయకపోవటం..గెలిచే సీట్ల పైన అంచనాలు కూడా చెప్పకపోవటం పైన భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. దీంతో, ఈ నెల 31న చంద్రబాబు తన మిత్రపక్ష పార్టీల నేతలు పవన్, పురందేశ్వరితో భేటీ అవుతున్నారు. మూడు పార్టీల నేతలు ఓటింగ్ సరళి..తమకు అందిన నివేదికల పై చర్చించనున్నారు. ఆ తరువాత ఉమ్మడి మీడియా సమావేశంలో ఎన్నికల పలితాల పై తమ అంచనాలను వెల్లడించనున్నారు.