ఏపీలో ఈసారి సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా పల్నాడు జిల్లాలోని పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. వీటిలో మాచర్లలోని పాల్వాయ్ గేట్ పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం ఘటన కూడా ఒకటి. అయితే పోలింగ్ రోజు జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వారం రోజుల తర్వాత వీడియోతో బయటికి వచ్చింది.దీనిపై ఇప్పటికే ఆగ్రహంగా ఉన్న ఈసీ.. మరో కీలక ఆదేశం జారీ చేసింది.
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా సమస్యాత్మక ప్రాంతమైన మాచర్లలోని పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో చోటు చేసుకున్న ఈవీఎం ధ్వంసం ఘటనకు సంబంధించి వెబ్ క్యాస్టింగ్ ఫుటేజ్ ఉన్నా విధి నిర్వహణలో ఉన్న అధికారులు దాన్ని దాచేశారు. దీంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. దీంతో ఇప్పుడు వెబ్ క్యాస్టింగ్ బాధ్యతలు చూస్తున్న జిల్లా పోలింగ్ అధికారి (డీపీఓ) విజయ్ భాస్కర్ రెడ్డిపై ఈసీ సీరియస్ అయింది.
ఈవీఎం ధ్వంసం ఘటనను దాచేందుకు ప్రయత్నించిన పల్నాడు డీపీవో విజయభాస్కర్ రెడ్డిపై విచారణకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. పల్నాడు డీపీవో విజయభాస్కర్ రెడ్డిపై ఈ మేరకు విచారణకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మాచర్ల నియోజకవర్గానికి వెబ్ కాస్టింగ్, పర్యవేక్షణ అధికారిగా ఉన్న డీపీఓ విజయభాస్కర్ రెడ్డి..పాల్వాయ్ గేట్ పోలింగ్ కేంద్రంలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ఈవీఎంని ధ్వంసం చేసిన విషయాన్ని ఉన్నతాధికారులకు చెప్పకుండా గోప్యంగా ఉంచారు.
దీంతో డీపీఓ విజయభాస్కర్ రెడ్డిపై ఎన్నికల సంఘానికి టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఉద్దేశపూర్వకంగా వెబ్ క్యాస్టింగ్ ఫుటేజ్ ను దాచేసి పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం ఘటన బయటికి రాకుండా చేశారని ఫిర్యాదులో ఆరోపించారు. దీనిపై రంగంలోకి దిగిన ఈసీ.. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ బాలాజీకి ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఈ ఘటనపై జిల్లా ఎన్నికల అధికారి (డీఈవో)గా ఉన్న బాలాజీ విచారణ జరుపుతున్నారు. ఈ మేరకు త్వరలో ఈసీకి నివేదిక పంపనున్నారు.