పార్లమెంటు ఎన్నికల ఐదు దశలకు సంబంధించిన పోలింగ్ వివరాలు, ఓటు వేసిన వారి పూర్తి శాతాలను శనివారం కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. అయితే, పోలింగ్ ముగిసిన 48 గంటల్లోగా బూత్ లో పోలైనటువంటి, అదేవిధంగా తిరస్కరించిన ఓట్లతో సహా పోలింగ్ డేటాను విడుదల చేయాలని, ప్రతి దశ పోలింగ్ తర్వాత డేటాను సంకలనం చేసి సంబంధింతి వెబ్ సైట్ లో ప్రచురించే ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే, ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణను వాయిదా వేసింది.
అయితే, పోలింగ్ ముగిసిన తరువాత ఓటింగ్ శాతాలు పెరుగుతున్నట్లు వస్తున్న ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తింది. దేశంలో ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు ఎన్నికల ప్రక్రియను దెబ్బతీసేందుకే ఇలాంటి తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది. సుప్రీంకోర్టు పరిశీలనలు, అదేవిధంగా తీర్పుతో ఓటింగ్ శాతం డేటా విడుదల ప్రక్రియ మరింత బలపడనున్నదని తెలిపింది. డేటా విడుదల కసరత్తు మొత్తం కూడా ఎటువంటి తేడా లేకుండా ఖచ్చితమైనటువంటి, స్థిరమైనటువంటి, ఎన్నికల చట్టాలకు అనుగుణంగా జరుగుతుందని ఈసీ పేర్కొన్నది. ఎన్నికల ప్రజాస్వామ్యం కోసం సేవ చేయాల్సిన ఉన్నతమైన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని గుర్తు చేసింది.
అదేవిధంగా ఏప్రిల్ 19 నుంచి ముగిసిన ఐదు దశల పోలింగ్ వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ప్రతి దశలో పోలింగ్ రోజున ఉదయం 9.30 గంటల నుంచి ‘ఓటర్ రిటర్నింగ్ యాప్’ లో డేటా ఎల్లప్పుడూ 24/7 అందుబాటులో ఉంటుందని పేర్కొన్నది. అదేవిధంగా ప్రతి దశలో సాయంత్రం 5.30 గంటల వరకు ప్రతి రెండు గంటలకు ఒకసారి కొత్త పోలింగ్ శాతాలను తెలియజేస్తామని పేర్కొన్నది. ప్రతి దశ పోలింగ్ అనంతరం సాయంత్రం 7 గంటల తరువాత నుండి డేటాను నిరంతరం అప్ డేట్ చేస్తామని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొన్నది.
కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన ఐదు దశల ఎన్నికల పోలింగ్ కు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
తొలి విడతలో – 66.14 శాతం పోలింగ్ నమోదు
రెండో విడతలో – 66.71 శాతం పోలింగ్ నమోదు
మూడో విడతలో – 65.68 శాతం పోలింగ్ నమోదు
నాలుగో విడతలో – 69.16 శాతం పోలింగ్ నమోదు
ఐదో విడతలో – 62.20 శాతం పోలింగ్ నమోదు
అయితే, దేశవ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరుగుతుంది. ఇప్పటివరకు ఆరు విడతల పోలింగ్ పూర్తి అయ్యింది. చివరి విడత.. ఏడో విడత జూన్ 1న జరగనున్నది. ఇక, శనివారం ఆరో విడతలో సాయంత్రం 5 గంటల వరకు 57.7 శాతం పోలింగ్ నమోదైందని ఈసీ పేర్కొన్న విషయం తెలిసిందే.