UPDATES  

NEWS

 వైఎస్ షర్మిలకు ఈసీ షాక్- వివేకా కేసులో వ్యాఖ్యలకు నోటీసులు..!

ఏపీ ఎన్నికల్లో రాజకీయ నేతల అనుచిత విమర్శలపై ఈసీ కొరడా ఝళిపిస్తోంది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలవుతున్న నేపథ్యంలో ప్రత్యర్ధులపై ఆచితూచి విమర్శలు చేయాలని సూచిస్తోంది. అయినా పట్టించుకోని రాజకీయ నేతలపై చర్యలకు సిద్దమవుతోంది. ఇందులో భాగంగా ఇవాళ పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిలకు ఈసీ నోటీసులు జారీ చేసింది. ఆమెపై తాజాగా వైసీపీతో పాటు వివేకా కేసులో అప్రూవర్ గా ఉన్న దస్తగిరి చేసిన ఫిర్యాదు మేరకు నోటీసులు పంపింది.

 

కడప లోక్ సభ స్ధానంలో కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలో ఉన్న వైఎస్ షర్మిల ఈ మధ్య మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యలో వైఎస్ అవినాష్ తో పాటు ఇతరుల పాత్రపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో పదే పదే వివేకా కేసును ప్రస్తావిస్తున్నారు. దీనిపై ఇప్పటికే కడప కోర్టు కూడా ఆమెకు వివేకా కేసుపై వ్యాఖ్యలు చేయొద్దని ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో వైసీపీ నేత మల్లాది విష్ణు కూడా ఈసీకి ఫిర్యాదు చేశారు.

 

వివేకా కేసులో దస్తగిరి పేరును కూడా ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించడంపై ఆయన కూడా ఈసీని ఆశ్రయించారు. దీంతో స్పందించిన ఎన్నికల సంఘం ఈ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కోరుతూ వైఎస్ షర్మిలకు ఇవాళ నోటీసులు జారీ చేసింది. మల్లాది విష్ణు, దస్తగిరి లో ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించిన ఎన్నికల కమిషన్ ఈ నోటీసులు ఇచ్చింది. ఇందులో షర్మిల ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లు ప్రాథమికంగా గుర్తించింది.కాబట్టి 48 గంటల్లోగా ఫిర్యాదులపై వివరణ ఇవ్వాలని షర్మిలకు సీఈవో ముఖేష్ కుమార్ మీనా నోటీసులు జారీ చేశారు. గడువులోగా వివరణ ఇవ్వకుంటే ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే చర్యలు తీసుకుంటామని ఇందులో పేర్కొన్నారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |