UPDATES  

NEWS

 విచారణ లో కాకాణి పై సిట్ ప్రశ్నల వర్షం..! సిట్ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి..!

సర్వేపల్లి జలాశయంలో గ్రావెల్ అక్రమ తవ్వకాల కేసులో సిట్ కస్టడీలో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని రెండో రోజు విచారణలో అధికారులు కీలక ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. ముఖ్యంగా ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న నిరంజన్ రెడ్డి బ్యాంకు ఖాతా నుంచి కాకాణి కుమార్తె ఖాతాకు రూ.70 లక్షలు బదిలీ అయినట్లు గుర్తించిన సిట్ అధికారులు, దీనిపై ఆయనను కూలంకషంగా ప్రశ్నించినట్లు స‌మాచారం.

 

కృష్ణపట్నం పోలీస్ స్టేషన్‌లో జరిగిన ఈ విచారణకు బాపట్ల సిట్ డీఎస్పీ రామాంజనేయులు నేతృత్వం వహించారు. తొలి రోజు విచారణలో కాకాణి నుంచి సరైన సమాధానాలు రాకపోవడంతో రెండో రోజు అధికారులు పూర్తిగా ఆర్థిక లావాదేవీలపై దృష్టి సారించారు. గ్రావెల్ అక్రమ తవ్వకాల సమయంలో నిరంజన్ రెడ్డి ఖాతా నుంచి జరిగిన రూ.10 కోట్ల విలువైన లావాదేవీలను అధికారులు గుర్తించారు. ఇందులో భాగంగానే కాకాణి కుమార్తె ఖాతాకు బదిలీ అయిన రూ.70 లక్షల విషయంపై అధికారులు ప్రశ్నించారు.

 

ఈ ప్రశ్నకు కాకాణి స్పందిస్తూ, “నా కుమార్తెకు వివాహం చేసి పంపించాను. వారి వ్యాపార లావాదేవీలతో నాకేలాంటి సంబంధం లేదు. వారి మధ్య ఏం జరిగిందో నాకేం తెలుసు?” అని సమాధానమిచ్చినట్లు సమాచారం. అలాగే, నిరంజన్ రెడ్డి సింగపూర్‌లో కొనుగోలు చేసిన గృహోపకరణాలు మీ ఇంటికేనా అని ప్రశ్నించగా… తన ఇంట్లోని వస్తువులన్నీ తానే కొనుగోలు చేశానని కాకాణి చెప్పినట్లు తెలిసింది. విచారణలో చాలా ప్రశ్నలకు ఆయన ఇదే రీతిలో దాటవేత సమాధానాలు ఇచ్చారని తెలుస్తోంది.

 

మధ్యాహ్నం 3 గంటల వరకు సాగిన ఈ విచారణ అనంతరం అధికారులు కాకాణిని జిల్లా రెండో అదనపు కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. కోర్టు ప్రక్రియ ముగిసిన తర్వాత ఆయన్ను తిరిగి నెల్లూరు కేంద్ర కారాగారానికి తరలించారు. ఈ కేసులో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి సంతకాన్ని ఫోర్జరీ చేశారన్న ఆరోపణలపై కూడా విచారణ కొనసాగుతోంది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |