UPDATES  

NEWS

 మంత్రులు అప్రమత్తంగా ఉండాలి.. రేవంత్ రెడ్డి ఫోన్లు ట్యాప్ చేయిస్తున్నారు: కేటీఆర్ తీవ్ర ఆరోపణలు..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. స్వయంగా ముఖ్యమంత్రి తమ కేబినెట్‌లోని మంత్రుల ఫోన్లను ట్యాప్ చేయిస్తున్నారని అన్నారు. శుక్రవారం ఒక మీడియా సంస్థ ప్రతినిధితో మాట్లాడుతూ కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

 

కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రులంతా అప్రమత్తంగా ఉండాలని కేటీఆర్ సూచించారు. సీఎం రేవంత్ రెడ్డికి తన పదవికి ఎక్కడ ముప్పు వాటిల్లుతుందోనన్న భయం పట్టుకుందని, అందుకే నిత్యం భయపడుతూ మంత్రుల ఫోన్లను ట్యాపింగ్‌ చేయిస్తున్నారని ఆరోపించారు.

 

అంతేకాకుండా, బీఆర్ఎస్‌ను అప్రతిష్ఠపాలు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తుంటే, బీజేపీ నేతలు ఆయనకు మద్దతు పలుకుతున్నారని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీలు కలిసి కుట్రపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆయన మండిపడ్డారు.

 

రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్రంలో ఏ ఒక్క గ్రామంలో కూడా వంద శాతం రుణమాఫీ జరగలేదని అన్నారు. రుణమాఫీ చేసినట్లు నిరూపిస్తే తాను రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని మరోసారి సవాల్ విసిరారు. ఢిల్లీ అధిష్ఠానాన్ని ప్రసన్నం చేసుకునే హడావిడిలో ముఖ్యమంత్రి ఉంటే, మంత్రులు రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలా అని ఆలోచిస్తున్నారని విమర్శించారు.

 

కొందరు పెద్దల ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ గాలి మాటలేనని, వీటిని నమ్మి ప్రజలు మోసపోయారని అన్నారు. మోసపు హామీలతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజలు ఇప్పుడు వాస్తవాన్ని గ్రహించారని, అందుకే కేసీఆర్ సభల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని కేటీఆర్ తెలిపారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |