UPDATES  

NEWS

 లిక్కర్ స్కామ్ కేసులో ట్విస్ట్..! రాజ్ కసిరెడ్డి అరెస్ట్..!

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో కీలక సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి అలియాస్ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని ఎట్టకేలకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నాలుగు సార్లు విచారణకు గైర్హాజరై, తప్పించుకు తిరుగుతున్న ఆయనను సోమవారం సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయంలో అత్యంత చాకచక్యంగా అరెస్ట్ చేశారు.

 

సిట్ విచారణకు రాకుండా తప్పించుకు తిరుగుతున్న రాజ్ కసిరెడ్డి ఆచూకీ కోసం అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఆయన తండ్రి ఉపేందర్ రెడ్డిని సిట్ ప్రశ్నించింది. విచారణ అనంతరం, పోలీసుల విచారణ వివరాలను తెలుసుకునేందుకు రాజ్ కసిరెడ్డి తన తండ్రికి వాట్సాప్ ద్వారా సందేశం పంపారు. అప్పటికే ఉపేందర్ రెడ్డి ఫోన్‌పై నిఘా ఉంచిన సిట్ అధికారులు, ఆ సందేశం గోవా నుంచి వచ్చినట్లు గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన సిట్ బృందం ఒకటి సోమవారం ఉదయం గోవాకు బయలుదేరింది. అయితే, ఈ విషయం ముందుగానే తెలుసుకున్న రాజ్ కసిరెడ్డి, మంగళవారం విచారణకు హాజరవుతానంటూ ఓ ఆడియో సందేశం విడుదల చేశారు. మరోవైపు, ‘రాజేశ్ రెడ్డి’ పేరుతో సృష్టించిన నకిలీ ఐడీతో గోవా నుంచి ఇండిగో విమానంలో హైదరాబాద్‌కు టికెట్ బుక్ చేసుకున్నారు.

 

ఈ సమాచారాన్ని పసిగట్టిన సిట్ అధికారులు, శంషాబాద్ విమానాశ్రయంలో మరో బృందాన్ని మోహరించారు. కసిరెడ్డి హైదరాబాద్‌లో దిగి, నేరుగా చెన్నై వెళ్లేందుకు మరో విమాన టికెట్ సైతం బుక్ చేసుకున్నట్లు గుర్తించారు. బహుశా చెన్నై నుంచి విదేశాలకు పారిపోవాలన్నది ఆయన వ్యూహంగా సిట్ అనుమానించింది. విమానం దిగినా రాజ్ కసిరెడ్డి ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో, విమానాశ్రయ అధికారుల సహకారంతో సిట్ బృందం లోపలికి ప్రవేశించింది. అక్కడే ఆయన్ను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా, “రేపు విచారణకు వస్తాను, వదిలేయండి” అని ఆయన అధికారులను కోరినప్పటికీ, నాలుగు సార్లు నోటీసులిచ్చినా రాని వ్యక్తి మాటలను నమ్మలేమని స్పష్టం చేసి అరెస్ట్ చేశారు.

 

అనంతరం రాజ్ కసిరెడ్డి అరెస్ట్ విషయాన్ని ఆయన తండ్రికి ఫోన్ ద్వారా తెలియజేసి, నిన్న రాత్రే విజయవాడలోని సిట్ కార్యాలయానికి తరలించారు. ఆయన్ను ఈరోజు సీఐడీ కోర్టులో హాజరుపరిచి, కస్టడీకి కోరే అవకాశం ఉంది. గతంలో సిట్ ఆయన ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించి కీలక పత్రాలు స్వాధీనం చేసుకోవడంతో పాటు, లుక్ అవుట్ సర్క్యులర్ కూడా జారీ చేసిన సంగతి తెలిసిందే.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |