రాజ్యాంగ నిర్మాత, డాక్డర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు సీఎం రేవంత్‌రెడ్డి. ఆయన జయంతి సందర్భంగా.. ఆ మహానీయుడి సేవలను సర్మిరించుకున్నారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ముందుకు సాగుతానన్నారు సీఎం. ఆయన ఇచ్చిన స్ఫూర్తితోనే విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లో బడుగు, బలహీనవర్గాలకు 42 శాతల రిజర్వేషన్లు కల్పించినట్లు చెప్పారు. ఇక SC వర్గీకరణతో 3 దశాబ్దాల పోరాట ఆకాంక్షలు నెరవేరుస్తున్నామన్నారు. రైతులు, రైతు కూలీలకు ఎకరాకు 12 వేల ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని చెప్పారు. రైతు, పేద భూమికి హక్కుపై భరోసా ఇస్తూ భూభారతికి శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు రేవంత్‌రెడ్డి.
ట్యాంక్ బండ్ దగ్గర అంబేద్కర్ 134 వ జయంతి వేడుకలు నిర్వహిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అంబేద్కర్ విగ్రహానికి సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కతో పాటు పలువురు నేతలు నివాళులు అర్పించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలతో ప్రత్యేకంగా అలంకరణ చేశారు.
ఈ సందర్భంగా.. అంబేద్కర్ జయంతిరోజున ఈ జీవోను విడుదల చేసింది ప్రభుత్వం. 59 ఎస్సీ కులాలను మూడు గ్రూపులుగా విభజించింది. సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో ప్రాతినిధ్యం ఆధారంగా అత్యంత వెనుకబడిన కులాలను గ్రూప్-1లో, మధ్యస్థ లబ్ధిపొందిన కులాలను గ్రూప్-2లో, మెరుగైన ప్రయోజనాలు పొందిన కులాలను గ్రూప్-3లో చేర్చింది. 2011 జనాభా గణాంకాల ప్రాతిపదికన.. ఎస్సీ జనాభాలో 61.96 శాతం ఉన్న మాదిగ కులంతో సహా 18 కులాలను గ్రూప్-2 కింద చేర్చి.. 9 శాతం రిజర్వేషన్లను ప్రతిపాదించింది. 29.26 శాతం ఉన్న మాల, మాలఅయ్యవార్ కులంతో సహా 26 కులాలను గ్రూప్-3లో చేర్చి 5 శాతం రిజర్వేషన్లు.. 3.28 శాతం మంది ఉన్న 15 కులాలను.. గ్రూప్-1లో చేర్చి ఒక శాతం రిజర్వేషన్లను ప్రతిపాదించింది.
కొద్దిరోజుల క్రితమే తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమలుకు ఉభయ సభలు పచ్చజెండా ఊపాయి. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ షమీమ్ అక్తర్ ఏకసభ్య కమిషన్ నాలుగు సిఫార్సులు చేసింది. వాటిలో… రాష్ట్రంలోని మొత్తం ఎస్సీ కులాలను మూడు గ్రూపులుగా వర్గీకరించడం, ఉద్యోగాల భర్తీ విధానం, రోస్టర్ పాయింట్ల విభజన ప్రతిపాదనలను ఆమోదించిన సర్కారు.. క్రీమీలేయర్ సిఫార్సును తిరస్కరించింది. మంత్రిమండలి ఆమోదించిన అనంతరం సంబంధిత నివేదికను.. శాసనసభ, శాసనమండలిలో ప్రవేశపెట్టింది. రెండుచోట్లా నివేదికకు ఆమోదం లభించింది. దీంతో దాదాపు మూడు దశాబ్దాలుగా వర్గీకరణ కోసం ఎదురుచూస్తున్న వారికి లబ్ధి చేకూరింది.
కాగా.. తెలంగాణవ్యాప్తంగా సోమవారం నుంచి భూ భారతి పోర్టల్ అమల్లోకి రానుంది. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా భూభారతి చట్టాన్ని, పోర్టల్‌ను ప్రజలకు అంకితం చేస్తామన్నారు ముఖ్యమంత్రి. భూ సమస్యల పరిష్కారం, లావాదేవీలకు సంబంధించిన సమాచారం రైతులకు, ప్రజలకు సులభంగా, వేగంగా అందుబాటులో ఉండేలా భూభారతి పోర్టల్ ఉంటుందని వివరించారు. ఆ పోర్టల్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో రివ్యూ నిర్వహించారు.