వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్‌లోని ముర్షీదాబాద్‌లో జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో ముగ్గురు మరణించారు. మరికొందరు గాయపడ్డారు. హింస నేపథ్యంలో పారామిలటరీ బలగాలను మోహరించాలన్న హైకోర్టు ఆదేశాలతో నేడు బలగాలను మోహరించారు. పలు జిల్లాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో దీనిని తాము చూస్తూ కూర్చోలేమని హైకోర్టు స్పష్టం చేసింది.
వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా శుక్రవారం ప్రార్థనల తర్వాత మొదలైన ఆందోళనలు నిన్న కూడా కొనసాగాయి. ఆందోళన కాస్తా హింసాత్మకంగా మారడంతో ముగ్గురు మరణించారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు 138 మందిని అరెస్ట్ చేశారు. ఈ అల్లర్లపై బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి మాట్లాడుతూ రాష్ట్రంలో హిందువులకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ ప్రజలు శాంతియుతంగా ఉండాలని పిలుపునిచ్చారు. కొన్ని పార్టీలు తమ రాజకీయ లబ్ధి కోసం మతాన్ని వాడుకుంటున్నాయని దుమ్మెత్తి పోశారు. కాగా, హింసాత్మక ఘటనలతో అట్టుడికిన ముర్షీదాబాద్‌లో 300 మంది బీఎస్ఎఫ్ సిబ్బందిని మోహరించారు.