పెట్టుబడులదారుల చూపు ఏపీపై పడింది. ఆర్సెలార్ మిట్టల్-నిప్పన్ స్టీల్ సంయుక్తంగా అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తోంది. దీనికి సంబంధించి భూసేకరణ మొదలుపెట్టేసింది ప్రభుత్వం. తాజాగా అదే జిల్లాలో భారీగా పెట్టుబడి పెట్టేందుకు మరో కంపెనీ ముందుకొచ్చింది. లారస్ ల్యాబ్స్ లిమిటెడ్ కంపెనీ అదే జిల్లాలో తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఈ యూనిట్ వల్ల సుమారు 7,500 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కలగనుంది.
అనకాపల్లిపై వ్యాపారవేత్తల దృష్టి
అనకాపల్లి జిల్లాలో బల్క్ డ్రగ్స్ పరిశ్రమ ఏర్పాటుకు ముందుకొచ్చింది లారస్ ల్యాబ్స్ లిమిటెడ్. రాంబిల్లి మండలంలోని గోరపూడిలో దాదాపు రూ.5,000 కోట్ల పెట్టుబడితో తయారీ యూనిట్‌ను నెల కొల్పనుంది. ఈ ప్రాజెక్ట్ వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 7 వేల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రానున్నాయి. ఏర్పాటు చేయనున్న పరిశ్రమలో ఫర్మంటేషన్, క్రాప్ సైన్స్ కెమికల్స్, స్పెషాలిటీ కెమికల్స్ ఉత్పత్తి జరగనుంది.
విశాఖ పరిసర ప్రాంతాల్లో 2007 నుంచి పెట్టుబడులు పెడుతూ వస్తోంది లారస్ ల్యాబ్స్. ఇప్పటికి రూ.6,500 కోట్లతో తయారీ యూనిట్లను స్థాపించింది. బెంగళూరు, హైదరాబాద్‌లో ఈ సంస్థకు యూనిట్లు ఉన్నాయి. విస్తరణ లో భాగంగా అనకాపల్లిలో కొత్త పరిశ్రమను ప్రారంభించేందుకు మొదలుపెట్టింది. లారస్ ల్యాబ్స్ కంపెనీ ప్రతినిధులు కొద్దిరోజులుగా రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతూ వస్తోంది.
సీఎం చంద్రబాబుతో లారస్ ల్యాబ్స్ సీఈఓ భేటీ
ఈ నేపథ్యంలో గురువారం ఏప్రిల్ 3న అమరావతిలో సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు లారస్ ల్యాబ్స్ సీఈవో చావా సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ చావా నరసింహారావు. బల్క్ డ్రగ్స్ తయారీ యూనిట్ పెడతామని, తమకు భూములు కేటాయించాలని ముఖ్యమంత్రి వద్ద ప్రస్తావించారు. ఇందుకు భూకేటాయింపులు జరిగినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.
భూమి కేటాయింపులతోపాటు అన్ని విధాలుగా ప్రభుత్వం నుంచి సహకారాలు ఉంటాయని కంపెనీ పెద్దలకు సీఎం చంద్రబాబు తెలిపారు. సాధ్యమైనంత త్వరగా పనులు ప్రారంభించాలని సూచన చేశారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మా విధానమని వివరించారు. అనకాపల్లి జిల్లాను పారిశ్రామిక హబ్‌గా మార్చడానికి ఈ ప్రాజెక్ట్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు.
ఏపీలోపై వ్యాపారవేత్తల చూపు
ఇటీవలకాలంలో ఏపీలో పెట్టుబడులు క్రమంగా పెరుగుతున్నాయి. పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే కంపెనీలకు వేగంగా అనుమతులు మంజూరు చేస్తున్నారు. దీనికితోడు భారీగా ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. వీటిని అందుకునేందుకు వ్యాపారవేత్తలు దృష్టి ఏపీపై పడింది. భూములు వెతికేందుకు పనిలేకుండా అన్ని సిద్ధంగా ఉంచుతున్నారు.
రిలయన్స్ కంపెనీ పునరుత్పాదక ఇంధన సెక్టార్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. అలాగే జపాన్, సింగపూర్ దేశాల నుంచి వివిధ కంపెనీల ప్రతినిధులు వచ్చి సీఎం చంద్రబాబుతో సమావేశమవుతున్నారు. అమరావతి నిర్మాణంలో పాలు పంచుకునేందుకు కొన్ని సంస్థలు ముందుకొచ్చిన విషయం తెల్సిందే.