కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం హైకోర్టుకు చేరింది. ఆ 400 ఎకరాల భూమిని జాతీయ ఉద్యానవనంగా ప్రకటించాలని వట ఫౌండేషన్, HCU స్టూడెంట్స్ పిటిషన్ వేయగా.. కోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి. పిటిషనర్ తరఫున ఖరీదైన లాయర్ నిరంజన్‌రెడ్డి వాదించారు. ఆయనకు ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి ధీటుగా కౌంటర్ ఇచ్చారు.
పిటిషనర్ ఏమని వాదించారంటే..
హాలీవుడ్ సినిమాల తరహాలో.. భారీ సంఖ్యలో బుల్డోజర్లు పెట్టి.. 400 ఎకరాల భూమిని చదును చేస్తున్నారని న్యాయవాది నిరంజన్‌రెడ్డి అన్నారు. వందలాది మిషీన్లను అక్కడ మోహరించారని.. నిబంధనలకు విరుద్ధంగా వేలాది చెట్లను కూల్చేస్తున్నారని చెప్పారు. ఎక్స్‌పర్ట్ కమిటీ ఎలాంటి నిర్ణక్ష్ం తీసుకోకుండానే.. బాధ్యత ఉన్న ప్రభుత్వమే ఇలా చేయడం ఏంటని పిటిషినర్ తరఫు అడ్వకేట్ నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు.
ప్రభుత్వ అడ్వకేట్ ఏమన్నారంటే..
అసలు ఆ భూమి అటవీ ప్రాంతమే కాదని.. ఆ ల్యాండ్ పరిశ్రమల అవసరాల కోసమే కేటాయించారని ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్‌రెడ్డి వాదించారు. పక్కనే ఉన్న HCU భూముల్లో భారీ భవనాలు నిర్మించారనరి.. అందులో 4 హెలిప్యాడ్‌లు కూడా ఉన్నాయని అన్నారు. హైదరాబాద్‌లో చాలా చోట్ల నెమళ్లు, పాములు, చెట్లు ఉన్నాయని.. అలాగైతే వాటిని కూడా అటవీ భూములుగా ప్రకటించాల్సి ఉంటుందని.. నగరంలో ఎక్కడా నిర్మాణాలు చేపట్టకూడదని అన్నారు. 2003లో ఎకరం 50వేలకు చొప్పున ఆ భూములను IMGకి అమ్మేశారని అన్నారు. 2006లో ఈ కేటాయింపులను అప్పటి ప్రభుత్వం రద్దు చేసిందని.. దానిపై IMG కోర్టుకు వెళ్లిందని చెప్పారు. ఆ సమయంలోనే వీళ్లంతా ఎందుకు కోర్టులో పిటిషన్ వేయలేదని ప్రశ్నించారు ఏజీ.
గురువారం వరకు బ్రేక్
వాదనల మధ్యలో హైకోర్టు చీఫ్ జస్టిస్ జోక్యం చేసుకుని.. ఇది పరిశ్రమల భూమి అని ఎక్కడైనా రికార్డ్ అయిందా అని అడిగారు. మొదటి నుంచి అది పరిశ్రమలకు కేటాయించిన భూమియే అని ఏజీ కోర్టుకు తెలిపారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం.. విచారణను గురువారం మధ్యాహ్నానికి వాయిదా వేసింది. అప్పటి వరకు కంచె గచ్చిబౌలి భూముల్లో చెట్లను నరకొద్దని, భూములను చదును చేయొద్దని ఆదేశించింది.
అసలేంటి వివాదం?
కంచ గచ్చిబౌలి ప్రాంతంలో ఉన్న 400 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఐటీ కంపెనీలు ఏర్పాటు చేసేలా అభివృద్ధి చేయాలని TGIIC కి కేటాయించింది తెలంగాణ ప్రభుత్వం. సంస్థ తరఫున ఆ భూమిని చదును చేస్తున్నారు. అయితే, ఆ ల్యాండ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిందని కొందరు ప్రచారం చేస్తున్నారు. అవి అటవీ భూములని వాటిని కొట్టేస్తున్నారని మరో ఆరోపణ. ఈ గొడవలో HCU స్టూడెంట్స్ ఎంటర్ అయ్యారు. వారికి బీజీపీ, బీఆర్ఎస్ పార్టీలు సపోర్ట్ ఇస్తున్నాయి. సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు, ఫోటోలతో ఫేక్ పబ్లిసిటీ కూడా నడుస్తోంది. అసలు ఆ భూమితో HCUకు ఎలాంటి సంబంధం లేదనేది సర్కారు వాదన. 2004లో ఆ ల్యాండ్‌ను బిల్లీరావు అనే వ్యక్తికి చెందిన IMG కంపెనీకి కట్టబెట్టారని చెబుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో కేసులు గెలిచి.. తిరిగి ఆ భూమిని ప్రభుత్వం సొంతం చేశామని క్లారిటీ ఇస్తోంది. అందులో ఎలాంటి అడవి లేదని.. చెరువులు, పార్కులు కూడా ఆ 400 ఎకరాల్లో లేవని అంటోంది. వాడకుండా వదిలేసిన భూమి కాబట్టి చెట్లు మొలిచాయని వాటిని చదును చేస్తే తప్పేముందని తమ నిర్ణయంపై సర్కారు గట్టిగా స్టాండ్ అవుతోంది. మరి, కోర్టు ఏమంటుందో చూడాలి..