UPDATES  

NEWS

 పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో మలుపు…

పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసు ప్రమాదమా? పన్నాగమా? అనే మిస్టరీపై ఒక్కొక్కరు ఎవరికి తోచిన విధంగా వారు స్పందిస్తున్నారు. అయితే, ఈ కేసును పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. విజయవాడ నుంచి రాజమండ్రి వరకు ప్రవీణ్ ప్రయాణాన్ని పూర్తిగా సీసీ కెమెరాల ఆధారంగా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ప్రవీణ్ ద్విచక్ర వాహనానికి సమీపంలో వెళ్లిన రెడ్ కలర్ కార్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

 

పాస్టర్‌ ప్రవీణ్‌ మృతిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ నర్సింహ కిషోర్ ప్రకటించారు. ప్రవీణ్‌ చనిపోవడానికి ముందు సీసీ కెమెరా ఫుటేజ్‌ల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ప్రవీణ్‌ మృతిని అనుమానాస్పద కేసుగా నమోదు చేశారు. నాలుగు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు ఎస్పీ. ఇద్దరు DSPలు నలుగురు, CIలు 8 మంది ఎస్సైలు ఈ కేసుపై సమగ్ర విచారణ చేస్తున్నట్టు తెలిపారు.

 

ఇక ఈనెల 24న విజయవాడ మీదుగా రాజమండ్రికి వస్తుండగా మృతి చెందారు పాస్టర్ ప్రవీణ్‌. రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన కేసులో తాజాగా కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో విజయవాడకు సాయంత్రం 5 గంటలకు పాస్టర్ ప్రవీణ్ చేరుకున్నట్టు గుర్తంచారు. రాత్రి 8 గంటల 45 నిమిషాలకు ఎనికేపాడు దాటినట్లు సీసీ కెమెరాల్లో రికార్డైంది. దీంతో ఆ మూడు గంటల పాటు ఆయన ఎక్కడికి వెళ్లారు? ఏం చేశారు? ఈ సమయంలో జరిగిన సంఘటనలే ఆయన మృతికి కారణమా? అంటూ అనేకానేక ఇష్యూలు తెరపైకి వచ్చాయి. సోషల్ మీడియాలో ఎవరికి నచ్చినట్టు వాళ్లు పోస్టులు పెడుతున్నారు. అయితే ఇప్పుడా మిస్టరీ వీడింది. ఆయన ఆ మూడు గంటలు ఎక్కడున్నారో.. ఏం చేశారో.. కనిపెట్టారు పోలీసులు.

 

హైదరాబాద్‌ నుంచి బైక్‌పై బయల్దేరిన ప్రవీణ్… విజయవాడకు చేరుకోవడానికి ముందే తన బైక్‌కు ప్రమాదం జరిగిందని గుర్తించారు. రామవరప్పాడు రింగ్‌కు 50 మీటర్లు ముందు నేషనల్ హైవేపై బైక్‌ను ఆపి పక్కన కూర్చున్నారు. అంతకుముందు జరిగిన ప్రమాదంలో ఆయన బైక్‌ స్వల్పంగా దెబ్బతిన్నదని గుర్తించారు. రెండు రోజులుగా మహానాడు జంక్షన్‌ నుంచి ఎనికేపాడు వరకు సుమారు 200 కెమెరాలను పోలీసులు జల్లెడ పట్టడంతో ఈ విషయాలు బయటికి వచ్చాయి.

 

సాయంత్రం 4:45కి విజయవాడ శివారు గొల్లపూడిలో ఓ బంకులో పెట్రోల్ పోయించుకున్నారు ప్రవీణ్. అక్కడి నుంచి బయలుదేరి కనకదుర్గ ఫ్లైఓవర్ మీదుగా బెంజ్‌ సర్కిల్‌ చేరుకున్నారు. 5:20కి రామవరప్పాడు రింగ్‌కు కొద్ది దూరంలో బైక్‌ ఆపి కూర్చున్నారు. ఇది గమనించి అక్కడికి వచ్చిన ట్రాఫిక్‌ ఎస్‌ఐ సుబ్బారావు అతనికి తాగునీరు ఇచ్చి పక్కనున్న పార్కులో కూర్చోబెట్టారని దర్యాప్తులో తేలింది. సాయంత్రం ఐదున్నర గంటల నుంచి రాత్రి ఎన్నిమిదిన్నర గంటల వరకు ఆయన పార్క్‌లోనే రెస్ట్ తీసుకున్నారు.

 

అంతకుముందు జరిగిన ప్రమాదం కారణంగా ఆయన బైక్ నడిపే పరిస్థితిలో లేరని.. అందుకే రెస్ట్ తీసుకోవాలని పోలీసులు సూచించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కేసులో విచారణ కొనసాగుతోంది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |