UPDATES  

NEWS

 విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..

ఏపీ సీఎం ఢిల్లీ టూర్ నేటితో ముగిసింది. మరికాసేపట్లో అమరావతి బయలుదేరనున్నారు సీఎం చంద్రబాబు. ఢిల్లీ పర్యటనలో భాగంగా.. నిన్న కేంద్ర మంత్రి మనోహర్ లాల్ కట్టర్ ను కలిశారు సీఎం చంద్రబాబు. రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులపై కేంద్రమంత్రి కట్టర్ తో చర్చించారు. విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు వందశాతం.. సాయం అందించండని కేంద్ర మంత్రి కట్టర్ ను కోరారు సీఎం చంద్రబాబు.

 

ఆంధ్రప్రదేశ్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి, ఆర్థిక వృద్దిని పెంపొందించడానికి పట్టణాల్లో రవాణా సౌకర్యాలను మెరుగు పరచడానికి ఈ ప్రాజెక్టులు కీలకమైనవని కేంద్రమంత్రికి తెలిపారు సీఎం చంద్రబాబు. ఈ ప్రాజెక్టులను వెంటనే ఆమోదించి, ఆర్థిక సాయం అందించాలని కేంద్రమంత్రిని కోరారు ముఖ్యమంత్రి. మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, పట్టణీకరణ సవాలను పరిష్కరించడంలో ఈ ప్రాజెక్టుల ప్రాముఖ్యతను వివరిస్తూ ఒక నోట్ ను కేంద్ర మంత్రికి సమర్పించారు సీఎం చంద్రబాబు.

 

రాష్ట్ర విభజనకు ముందు హైదరాబాద్ మెట్రో రైల్ ఆమోదించారని.. విశాఖ, విజయవాడ ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు సీఎం చంద్రబాబు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి కానుంది. ఆలోగా.. మెట్రో కారిడార్ ని, నేషనల్ హైవేస్ తో అనుసంధానించటం ముఖ్యమన్నారు సీఎం చంద్రబాబు. రాజధాని అమరావతికి గేట్- వేగా విజయవాడ మెట్రో వ్యవస్థ ఏర్పాటు అవసరమనీ. దీని ద్వారా ప్రాంతీయ కనెక్టివిటీ బలోపేతం చేయోచ్చని కేంద్రమంత్రికి వివరించారు.. సీఎం చంద్రబాబు.

 

విజయవాడ పరిసరాల్లో.. ఆర్థికాభివృద్ధికి తోడ్పడటానికి ఇది చాలా అవసరమని, నగరంలో పెరుగుతున్న రవాణా అవసరాలను తీర్చడానికి.. ఈ ప్రాజెక్టును అత్యంత కీలకంగా పరిగణించాలని కేంద్ర మంత్రికి వివరించారు సీఎం చంద్రబాబు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటుందని.. మెట్రో ప్రాజెక్టును స్వతహాగా నిర్మించే పరిస్థితి లేదని తెలిపారు సీఎం చంద్రబాబు. సకాలంలో ప్రాజెక్టు మొదలు పెట్టేందుకు.. ఫేజ్- వన్ అనుమతులు, భూసేకరణకు కేంద్రం మద్దతు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ ప్రాజెక్టుల వల్ల వాయు కాలుష్యం తగ్గటమే కాక.. ట్రాఫిక్ సమస్య పరిష్కారమై.. దీర్ఘకాలిక ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని కేంద్రమంత్రి కట్టర్ కి వివరించారు సీఎం చంద్రబాబు.

 

2047 నాటికి నెం.1 ఆర్థిక వ్యవస్థగా భారత్

 

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో 2047 నాటికి భారతదేశం నెం.1 ఆర్థిక వ్యవస్థగా మారుతుందని, వరల్డ్ వైడ్‌గా వివిధ రంగాల్లో భారతీయులు ముందుంటారని సీఎం చంద్రబాబు అన్నారు. భారతీయులను యూదు సమాజంతో పోలుస్తూ, ప్రపంచంలో అత్యంత సంపన్నులుగా, ప్రభావవంతమైన వ్యక్తులుగా మన ఇండియన్స్ ఉన్నారని తెలిపారు. గురువారం ఢిల్లీలో రిపబ్లిక్ ప్లీనరీ సమ్మిట్‌లో పాల్గొన్నసీఎం పలు అంశాలపై మాట్లాడారు.

 

భారతీయుల ప్రతిభ ప్రతిబింబిస్తోంది.

 

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాంతాల్లో భారతీయులు సంపన్నులుగా ఉన్నారని, ఇది వారి ప్రతిభను ప్రతిబింబిస్తుందని సీఎం చంద్రబాబు తెలిపారు. యూఎస్ లో భారతీయుల సగటు ఆదాయం మిగిలిన వర్గాల కంటే ఎక్కువని చెప్పారు. అత్యధిక తలసరి ఆదాయం కలిగిన భారతీయుల్లో 33 శాతం మంది తెలుగు కమ్యూనిటీకి చెందినవారు ఉన్నారని అన్నారు. భారతదేశ వృద్ధికి ముఖ్యంగా మూడు రంగాలపై దృష్టి పెట్టినట్టు ముఖ్యమంత్రి వివరించారు. డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ద్వారా ఐటీ నుంచి ఏఐ కి మారడం. ఈ రంగాలపై దృష్టి సారించడం వల్ల భారతీయులు ప్రపంచంలోనే అత్యుత్తమ శ్రామిక శక్తిగా, ఆవిష్కర్తలుగా మారతారని అన్నారు.

 

భారతదేశానికి జనాభానే బలం :

భారతదేశ జనాభాలో 65 శాతం మంది 35 ఏళ్ల లోపు ఉండటం వల్ల ఇండియాకు జనాభా ప్రయోజనం ఉంది. చైనా, జపాన్ జనాభా తగ్గడం భారతదేశానికి కలిసొచ్చే అంశమని దానిని దేశ అభివృద్ధికి తెలివిగా వినియోగించుకోవాలని చెప్పారు. ఇద్దరు పిల్లల కంటే తక్కువ ఉన్న అభ్యర్థులు స్థానిక ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హులని చేసే విధానంపై కేంద్రం ఆలోచన చేయాలని చంద్రబాబు సూచించారు.

 

అమరావతి పునర్నిర్మాణం

గత కొన్నేళ్లుగా ఒడిదుడుకులను ఎదుర్కొన్న ఏపీ రాజధాని అమరావతిని పునరుజ్జీవింపజేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రపంచంలోనే ప్రత్యేకమైన సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ ను ఉపయోగించి 29,000 మంది రైతుల దగ్గర నుంచి 35,000 ఎకరాల భూమిని రాజధాని కోసం సేకరించారని గుర్తు చేశారు. ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధాని నగరాల్లో ఒకటిగా అమరావతిని తీర్చిదిద్దుతామని, దానిని మళ్లీ గాడిలోకి తీసుకువస్తామని స్పష్టం చేశారు.

 

చారిత్రాత్మక విజయం :

2024 ఎన్నికల్లో టీడీపీకి 93 శాతం స్ట్రైక్ రేట్, 57శాతం ఓట్ షేరును సాధించిందని సీఎం అన్నారు. తన నాయకత్వానికి ప్రజలు బలమైన మద్దతును ఇచ్చారని తెలిపారు. తాను ఎలాంటి నేరం చేయకుండా అరెస్టు చేస్తే, ప్రజలంతా ఆ సమయంలో తనకు అండగా నిలిచారని చెప్పారు. గవర్నెన్స్ అంటే కేవలం హార్డ్ వర్క్ మాత్రమే కాకుండా తెలివిగా ఉండాలని, 1,000 సేవలను మీ సేవ – వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందిస్తున్నామని వెల్లడించారు.

 

భారతదేశం ముందున్న మార్గం

భారతదేశ అభివృద్ధిని ఆపలేమని చంద్రబాబు అన్నారు. రానున్న పది, పదిహేను ఏళ్లలో భారతీయ నిపుణులు సేవా రంగంలో ప్రపంచవ్యాప్తంగా ఆధిపత్యం చెలాయిస్తారని అంచనా వేశారు. నేటి ప్రపంచంలో దూరం అనేది ఒక పరిమితి కాదని పేర్కొన్నారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |