జగన్ రాసిన లేఖపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు స్పందించారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ జగన్ బెదిరింపులకు పాల్పడుతున్నారనీ. హైకోర్టు స్పీకర్ కి నోటీసులు ఇచ్చినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారనీ. అసలు జగన్ వేసిన పిటిషన్ కు విచారణ అర్హత ఉందా లేదా అన్న అంశంపై హైకోర్టు ఒక నిర్దారణకే రాలేదని అన్నారు స్పీకర్ అయ్యన్న.
ఏపీ అసెంబ్లీలో వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం కుదరదని.. ప్రజలు జగన్ కి ఇవ్వని వరాన్ని తాను నెరవేర్చలేనని అన్నారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ఈ దిశగా ఒక రూలింగ్ పాస్ చేశారు. జగన్ సభకు హాజరు కావల్సిందేనని రూలింగ్ ఇచ్చారు. 2024 జూన్ 21న శాసన సభా సంప్రదాయాలకు అనుగుణంగానే జరిగిందని అన్నారు. జూన్ 24న స్పీకర్ కి రాసిన లేఖలో అవాస్తవాలు, బెదిరింపులతో పాటు తనకు ప్రతిపక్ష నాయకుడి హోదా ఉందంటూ.. జగన్ రాశారని.. సభలో ప్రస్తావించారు స్పీకర్ అయ్యన్న.
ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించగలిగే అధికారం స్పీకర్ కి మాత్రమే ఉంటుందన్న వాదన సరికాదని అన్నారు అయ్యన్న. జూన్ 26 వరకూ జగన్ మోహనరెడ్డి YSRCP శాసన సభాపక్ష నేతగా ఎన్నికయినట్టు సచివాలయానికే తెలపలేదని. జూన్ 26 కంటే ముందు స్పీకర్ ఎన్నిక జరగలేదు. అలాంటిది.. జగన్ కి ప్రతిపక్ష నాయకుడి హొదా నిర్ణయం తీసుకోవడం ఎలా సాధ్య పడుతుందని ప్రశ్నించారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ప్రతిపక్ష నాయకుడి గుర్తింపు అన్నది రాజ్యాంగ సూత్రాలు, కోర్టు తీర్పులు, చిరకాల సంప్రదాయాల మేరకు మాత్రమే నిర్దారించగలం. ఆంధ్రప్రదేశ్ వేతనాలు, పెన్షన్ చెల్లింపుల చట్టం- 1953లో ప్రతిపక్ష నాయకుడి ప్రస్తావన ఉందని అన్నారాయన. సెక్షన్ 12 బీ ప్రకారం ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే.. చట్టసభలో.. ప్రాతినిథ్యంతో పాటు.. ప్రభుత్వ వ్యతిరేక పార్టీకి సభలో నాయకుడై ఉండాలని స్పష్టం చేశారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు.
ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి తగిన సంఖ్యా బలం ఉండాలని. అలాంటి పార్టీలు ఒకటికి రెండు ఉన్నట్టయ్యితే.. సభాపతి ఒక నిర్ణయమంటూ తీస్కోవచ్చనీ. అలా చూసినా కూడా కనీసం 10 శాతం సీట్లు వచ్చి ఉండాలని క్లారిటీ వచ్చారు. 2019 జనవరి 20న పొరుగు రాష్ట్రంలో ఒక పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చారనీ.. అదే ఏడాది జూన్ 6న ప్రతిపక్షానికి సంఖ్యాబలం పది శాతం కంటే తగ్గడంతో.. ఆ సభాపతి ప్రతిపక్ష గుర్తింపు ఉపసంహరించుకున్నట్టు చెప్పారు స్పీకర్. పదిశాతం సంఖ్యాబలం లేకున్నా 8వ లోక్ సభలో ఉపేంద్రకు ప్రతిపక్ష నాయకుడి హోదా లభించిందని చెప్పడం కూడా కరెక్టు కాదు. టీడీపీ గ్రూపు నాయకుడిగా మాత్రమే గుర్తించారని వివరించారు అయ్యన్న. ఇదే ఏపీ అసెంబ్లీలో కనీసం 18 స్థానాల్లో ప్రాతినిథ్యం ఉంటేనే ప్రతిపక్ష హోదా లభిస్తుందని.. 2019లో సీఎం హోదాలో ఉన్న జగన్ అన్నారనీ. చంద్రబాబుకు 23 మంది ఎమ్మెల్యేలున్నారనీ. ఐదుగురిని లాగేస్తే ఆ హోదా కూడా ఉండదని సభలో జగన్ మాట్లాడిన విషయం గుర్తు చేశారు.
దేవుడు తిరస్కరించిన వరాన్ని పూజారి నుంచి ఆశించడం సరికాదని. ప్రజలు నిరాకరించిన హోదాను స్పీకర్ ఇవ్వలేడనీ అన్నారు అయ్యన్న. సభకు దూరంగా ఉంటే నియోజకవర్గ సమస్యలు సభలో ఎవరు పరిష్కరిస్తారు? ప్రజలిచ్చిన గౌరవాన్ని, బాధ్యతలను గుర్తుంచుకోవాలని హితవు పలికారాయన. రాజ్యాంగ బాధ్యతను నెరవేర్చాలనీ.. జగన్ సభకు వచ్చి ప్రజల గొంతు వినిపించాలని విజ్ఞప్తి చేశారు. నిరాధారమైన ఊహాగానాలతో సాగిస్తున్న దుష్ప్రచారాన్ని తెరదించేందుకే తాను ఈ మేరకు రూలింగ్ ఇస్తున్నట్టు చెప్పారు.