ఏపీ అసెంబ్లీ సమావేశాలలో వరుస శుభవార్తలను సీఎం చంద్రబాబు చెప్పేస్తున్నారు. అసెంబ్లీ సాక్షిగా పలు కీలక ప్రకటనలను సీఎం చేస్తున్నారు. ఇప్పటికే మంత్రి నారా లోకేష్ తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలపై ప్రకటన చేశారు. అయితే సీఎం చంద్రబాబు అంతకుమించిన గుడ్ న్యూస్ చెప్పారు. ఏపీ యువత ఆ స్కీమ్ కోసం ఎదురు చూస్తుండగా, ఎట్టకేలకు సీఎం చంద్రబాబు ఉన్నమాట చెప్పేశారు. ఇంతకు ఏంటా స్కీమ్ తెలుసుకుందాం.
కూటమికి 164 సీట్లు దక్కాయంటే, అంతా సూపర్ సిక్స్ మహిమే అంటారు. ఎన్నికల ప్రచారంలో సీఎం చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలను గుప్పించారు. అందుకే ఏపీ ప్రజలు కూటమికి దేశంలోనే కనీవినీ ఎరుగని రీతిలో మెజారిటీ ఇచ్చారు. అందుకే ప్రజలు ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా సీఎం చంద్రబాబు కూడా ఒక్కొక్క హామీని నెరవేర్చే పనిలో పడ్డారు. ఇప్పటికే సూపర్ సిక్స్ అమలుపై ప్రజల్లో ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, హామీలను నెరవేర్చడంలో వెనుకడుగు వేసేది లేదని సీఎం చంద్రబాబు పలుమార్లు ప్రకటనలు ఇచ్చారు.
అయితే సూపర్ సిక్స్ హామీలలో ఆ ఒక్క స్కీమ్ కోసం యువత ఎదురుచూస్తోంది. ఆ స్కీమ్ అమలైతే చాలు.. తమకు కాస్త ఆర్థిక చేయూత లభించినట్లేనని నిరుద్యోగ యువత ఆశిస్తోంది. అదే నిరుద్యోగ భృతి స్కీమ్. ఈ స్కీమ్ తో యువతకు ఎంతో మేలు చేకూరుతుందని చెప్పవచ్చు. నిరుద్యోగ భృతి స్కీమ్ ద్వారా నిరుద్యోగులకు ప్రతి నెలా రూ. 3000 లను ప్రభుత్వం అందజేస్తుంది. ఈ పథకం అమలైతే చాలు.. రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ పథకం అమలుకోసం ఎందరో నిరుద్యోగులు వెయిటింగ్ లో ఉన్నారు.
ఇలాంటి తరుణంలో నిరుద్యోగ యువతకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో మంగళవారం సీఎం చంద్రబాబు నిరుద్యోగ భృతి అందించడంపై కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు పెట్టుబడుల కోసం ప్రభుత్వం కృషి చేసిందన్నారు. ఇటీవల దావోస్ పర్యటన సమయంలో పలు కంపెనీల ప్రతినిధులతో చర్చించడం జరిగిందని, ఏపీలో పెట్టుబడుల కోసం పలు కంపెనీలు సుముఖత చూపాయన్నారు.
20 లక్షల ఉద్యోగాల కల్పన తమ ప్రభుత్వ లక్ష్యమని, రూ.6.50 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంఓయూ పూర్తి చేశామని, వీటి ద్వారా 5 లక్షల ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. తాము అధికారంలోకి రాగానే 203 అన్నా క్యాంటీన్ల ద్వారా పేదలకు అన్నం పెడుతున్నామన్నారు. అలాగే రాష్ట్ర ప్రజలంతా గర్వపడేలా అమరావతి రాజధానిని నిర్మిస్తామన్నారు.
అలాగే నిరుద్యోగులకు నెలకు రూ.3,000 భృతి త్వరలోనే అందిస్తామని సీఎం గుడ్ న్యూస్ చెప్పారు. సీఎం చేసిన ప్రకటనపై రాష్ట్రంలోని నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఏపీ బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో సూపర్ సిక్స్ హామీల అమలుకు బడ్జెట్ కేటాయిస్తుండగా, అందులో నిరుద్యోగ భృతి అందించేందుకు కూడా బడ్జెట్ కేటాయిస్తున్నట్లు సమాచారం. మొత్తం మీద భృతి అందిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించడంతో త్వరలోనే నిరుద్యోగుల కల నెరవేరుతుందని చెప్పవచ్చు.