అంతరిక్షంలో తిరిగే ఓ భారీ గ్రహశకలం భూమి వైపునకు దూసుకొస్తుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి విశ్వంలో లెక్కకు మిక్కిలి గ్రహశకలాలు తిరుగుతూ ఉంటాయి. వాటిలో కొన్ని భూమి చుట్టూ తిరిగితే.. మరికొన్ని గ్రహ శకలాలు భూ వాతావరణంలోకి ప్రవేశిస్తుంటాయి. వాటిలో చాలా వరకు ఇక్కడి గురుత్వాకర్ణ కారణంగా మండిపోతుంటాయి. కానీ.. తాజాగా శాస్త్రవేత్తలు గుర్తించిన ఈ శకలం మాత్రం చాలా పెద్దది. ఒకవేళ ఇది భూమిని ఢీకొడితే పెను విధ్వంసమే సంభవిస్తుంది. దాని ప్రభావం ఎంతలా ఉంటుంది అంటే.. మీ ఊహకు కూడా అందదంటున్నారు.. పరిశోధకులు. ఈ శకలం టార్గెట్గా ఉన్న నగరాల్లో మన చెన్నై, ముంబైయి కూడా ఉండడంతో.. ఇండియన్ సైంటిస్టులు సైతం దీని గమనంపై ఫోకస్ పెట్టారు.
అంతరిక్షంలో తిరిగుతూ.. భూమిని ఢీ కొట్టే అవకాశం ఉన్న శకలాలపై పరిశోధకులు నిత్యం ఓ కన్నేసి ఉంచుతారు. అందులో భాగంగా.. 2032 లో భూమిని ఢీకొనే అవకాశం ఎక్కువగా ఉన్న ఒక పెద్ద అంతరిక్ష శిల అయిన 2024 YR4 అనే ఆస్టరాయిడ్ శాస్త్రవేత్తల దృష్టికి వచ్చింది. దీని గమనాన్ని, దీని పరిమాణాన్ని పరిశీలిస్తున్న పరిశోధకులు.. ఇది ఏదో పెను ప్రమాదాన్ని మోసుకొస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ – నాసా లెక్కల ప్రకారం, ఈ గ్రహశకలం ప్రస్తుతానికి భూమిని ఢీకొనే అవకాశం 2.6 శాతం ఉంది. ఇప్పటి వరకు ఇలాంటి ప్రమాదకర గ్రహశకలాలకు కేటాయించిన అత్యధిక ప్రమాద స్థాయి అని న్యూ సైంటిస్ట్ నివేదిక వెల్లడిస్తోంది. కాగా.. దీనిని డిసెంబర్ 2024లో మొదటగా కనుక్కున్నారు.
మొదట్లో దీని గమనాన్ని పరిశీలించిన పరిశోధకులు.. భూమిని ఢీ కొట్టే అవకాశం 83వ వంతులో 1 శాతంగా ఉందని భావించారు. దాంతో.. ఇది ప్రయాణిస్తున్న మార్గం, వేగం సహా అనేక శాస్త్రీయ అంశాలను పరిగణలోకి తీసుకుని పరిశీలించగా.. ఆ అవకాశాలు మరింత దిగజారి.. భూమిని టార్గెట్ గా చేసుకునే అవకాశాలు 67వ వంతులో 1 వంతు నుంచి 53లో 1కి, తరువాత 43లో 1కి పడిపోయాయి. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ లెక్కలు ప్రకారం.. ఈ గ్రహ శకలం ఢీ కొనే అవకాశం.. 2.4 శాతం ఉన్నట్లు తేలుస్తుంది. భూమికి దగ్గరగా ఉన్న వస్తువులను (NEOs) వాటి సంభావ్య ప్రమాదం ఆధారంగా వర్గీకరించడానికి ఉపయోగించే వ్యవస్థ అయిన టొరినో స్కేల్‌పై NASA ఈ ఆస్టరాయిడ్ ప్రమాద తీవ్రతను లెక్కగట్టింది. అందులో.. ఈ గ్రహ శకలానికి లెవల్ 3 ముప్పు కేటాయించింది. ఈ స్థాయిలో రేటింగ్ చేసిన వస్తువులు, శకలాలను తప్పనిసరిగా భూమికి ప్రమాదకరంగా భావిస్తుంటారు. ఎందుకంటే అవి ఢీకొనే అవకాశం ఒక శాతం లేదా అంతకంటే ఎక్కువగా ఉంటుంది. పైగా.. భూవాతావరణంలో మండిపోయేందుకు అవకాశం ఉండదు, ప్రమాద విధ్వంసం భారీగా ఉంటుంది. అందుకే.. దీనిని నిత్యం ట్రాక్ చేస్తున్నారు.
దీని పరిణామం ఎంతో తెలుసా
శాస్త్రవేత్తలు గుర్తించిన YR4 గ్రహశకలం పరిమాణం 131-295 అడుగుల వ్యాసం మధ్య ఉంటుందని చెబుతున్నారు. అంటే.. చాలా పెద్ద శకలమే. అది ఢీకొంటే, దాని ఫలితంగా వచ్చే పేలుడు 8 మెగా టన్నుల TNTకి సమానమైన శక్తిని విడుదల చేస్తుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అంటే.. మామూలు పేలుడు కాదు.. మన ఊహలకు కూడా అందనంత భారీ స్థాయి పేలుడుగా చెబుతున్నారు. ఉదాహరణకు చెప్పాలంటే.. హిరోషిమాపై వేసిన అణు బాంబు శక్తికి దాదాపు 500 రెట్లు ఎక్కువ ప్రభావం ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.
దీని టార్గెట్ లో మన సిటీలు
ప్రస్తుతానికి ఈ గ్రహశకలం ప్రయాణిస్తున్న మార్గాన్ని అంచనా వేయడం ద్వారా..2032 నాటికి ఇది ప్రపంచంలోని అత్యంత జనసాంద్రత కలిగిన నగరాలపై విరుచుకుపడే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ముఖ్యంగా భారత్ కు చెందిన ప్రముఖ నగరాలైన ముంబై లేదంటే చెన్నై నగరాల్ని ఈ గ్రహశకలం ఢీకొట్టే అవకాశాలున్నాయి. ఇలాగే.. నైజీరియాలోని లాగోస్, కొలంబియాలోని బొగోటా దీని టార్గెట్ మార్గాల్లో ఉన్నాయి. ఈ ఆస్ట్రాయిడ్ కారణంగా దాదాపు 110 మిలియన్ల మంది ప్రజలు ప్రమాదంలో ఉన్నట్లే అని శాస్త్రవేత్తలు ఆందోళన వెలిబుచ్చుతున్నారు. అయితే.. ప్రస్తుతానికి ప్రమాద తీవ్రత ఎక్కువగానే ఉన్నప్పటికీ.. అంతరిక్ష వస్తువుల గమనం నిత్యం అనేక ప్రభావాలకు అనుగుణంగా మారుతుందని అందుకే.. ఎక్కువగా దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు. సౌతాంప్టన్ విశ్వవిద్యాలయంలో వ్యోమగామి నిపుణుడు ప్రొఫెసర్ హ్యూ లూయిస్ మాట్లాడుతూ.. “సంభావ్యత పెరిగినంత మాత్రాన అది అలాగే కొనసాగుతుందని అర్థం కాదు” అంటూ కాస్త ఉపశమనం కలిగించారు.
ప్రస్తుత గమనాన్ని బట్టి చూస్తే.. ఏప్రిల్‌లో YR4 సూర్యుని వెనుక అదృశ్యమనుంది. దీంతో.. మళ్లీ 2028 వరకు భూమి నుంచి దీనిని పరిశీలించేందుకు అవకాశం లేదు. కాబట్టి, శాస్త్రవేత్తలకు వారి అంచనాలు, గణనలను మరింత వేగవంతం వేగవంతం చేయాలని అంటున్నారు. ఈలోగా.. ఖగోళ శాస్త్రవేత్తలు ఆస్టరాయిడ్ పరారుణ ఉద్గారాలను (infrared emissions) విశ్లేషించేందుకు జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్‌ను ఉపయోగించుకోవాలని ప్రణాళికలు రచిస్తున్నారు.
దీని ద్వారా వాళ్లు శకలానికి సంబంధించిన ఖచ్చితమైన పరిమాణాన్ని, ఒకవేళ అది ఢీ కొడితే సంభవించే నష్ట ప్రభావాన్ని అంచనా వేసేందుకు వీలవుతుందని అంటున్నారు. ప్రస్తుతానికి, పరిశోధకులు అప్రమత్తంగా ఉన్నారు. భూమి తీవ్రమైన ప్రమాదంలో ఉందా, లేదా ఇది మరొక ఖగోళ తప్పుడు హెచ్చరికనా అని అంచనా వేసేందుకు వీలైనంత ఎక్కువ డేటాను సేకరిస్తున్నారు.