UPDATES  

NEWS

 రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దోహదపడేలా 2025 -26 బడ్జెట్..

రాష్ట్ర అభివృద్ధికి స్వర్ణాంధ్ర @ 2047 విజన్‌ను అనుసరించి 15 శాతం వృద్ధి రేటును సాధించడానికి, తలసరి ఆదాయం 42,000 డాలర్లకు పెంచే లక్ష్యంగా ఎటువంటి చర్యలు చేపట్టాలో మేధోమథనాన్ని తీవ్రతరం చేసి పటిష్ఠమైన ప్రణాళికలతో ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను 2.4 ట్రిలియన్ డాలర్ల జిఎస్‌డిపి ఆర్థిక వ్యవస్థగా మార్చాలని, తలసరి ఆదాయం 42,000 డాలర్లకు పెంచాలనే లక్ష్యంతో 2025-26 బడ్జెట్‌ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దోహదపడేలా రూపొందించాలని సూచించారని చెప్పారు.

 

రాష్ట్ర అభివృద్దిలో అన్ని శాఖల అధికారులను భాగస్వామ్యం చేస్తూ వారికి దశ దిశ నిర్దేశించే విధంగా, రాష్ట్రాభివృద్ధిని ఒక దిక్సూచిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రులు, కార్యదర్శుల సమావేశం జరిగిందని ఆయన పేర్కొన్నారు. మంగళవారం రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రజల ఆశలు, ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర మంత్రులను, కార్యదర్శులను కార్యోన్ముఖులుగా చేసే విధంగా ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలను జారీ చేయడం జరిగిందన్నారు. ఫైళ్ల క్లియరెన్సు వేగవంతం చేయాలని, ఫైనాన్స్‌కు సంబంధించినవి మినహా మరే ఇతర ఫైళ్లు పెండింగ్‌లో ఉండకూడదని స్పష్టం చేశారన్నారు.

 

విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన ఫైనాన్సుకు సంబంధించిన ఫైళ్లను సి.ఎస్.తో చర్చించి తగు నిర్ణయం తీసుకోవాలన్నారు. ఈ-ఆఫీసు అమలుపై సమీక్షిస్తూ ఈ నెలాఖరులోగా అన్ని శాఖలు ఈ-ఆఫీసుకు అనుసంధానం కావాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. ప్రజల సమస్యలను ఓప్పిగ్గా వినాలని, వారితో దురుసుగా ప్రవర్తించవద్దని, వారి సమస్యలపై సానుకూలంగా స్పందిస్తూ వాటి తక్షణ పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

 

కేంద్రం నుండి పెద్ద ఎత్తున నిధులను రాబట్టే విధంగా మంత్రులు, కార్యదర్శులు కృషిచేయాలని సూచించారని చెప్పారు. తెలంగాణతో పోలిస్తే జిఎస్‌డిపిలో రూ. 87,000 కోట్ల లోటు ఉందని, కొనుగోలు శక్తిని పెంచాలని పేర్కొన్నారన్నారు. జిఎస్‌డిపి లక్ష్యాలను చేరుకోవడానికి వ్యూహాత్మక విధానం అవసరమనే విషయాన్ని కార్యదర్శులు గుర్తించాలన్నారు. రాష్ట్ర స్థాయిలో విజన్ మానిటరింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేసి జిల్లాల ద్వారా నియోజకవర్గ స్థాయిలో ప్రణాళికలు రూపొందించాలని, జిఎస్‌డిపి వృద్ధికి దోహదపడే ప్రాజెక్టులను గుర్తించి, వాటిని ప్రత్యేక పోర్టల్ ద్వారా ట్రాక్ చేసే విధంగా ఆలోచన చేయాలన్నారు.

 

ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ పనితీరును ముఖ్యమంత్రి సమీక్షిస్తూ ఇంకా రెవెన్యూ, హోం, పంచాయతీ రాజ్, సివిల్ సప్లైస్ విభాగాల్లో పెండింగ్ లో నున్న సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారని తెలిపారు. పెన్షన్ పంపిణీ, అన్న క్యాంటీన్లు, ధాన్యం కొనుగోలు, దేవాలయ సేవలపై ప్రజల అభిప్రాయాన్ని సేకరించి వారి సంతృప్తి స్థాయిని తెలుసుకొని, పనితీరును మెరుగుపర్చుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టంగా ఆదేశించారని తెలిపారు.

 

ప్రభుత్వ ప్రాజెక్టుల సత్వర అమలుకు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పీఎంజీ (ప్రాజెక్ట్ మానిటరింగ్ గ్రూప్) విధానాన్ని రాష్ట్రంలోని అన్ని శాఖలు ఈ నెలఖారులోగా అవలంబించాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. దాదాపు రూ.50 కోట్ల పైబడిన ప్రాజక్టులను క్షుణ్ణంగా ట్రాక్ చేస్తూ, ఆ ప్రాజెక్టుల సమస్యలకు త్వరితగతిన పరిష్కారం లభించే విధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు.

 

మన మిత్ర వాట్సప్ గవర్నెన్స్ క్రింద ప్రస్తుతానికి దేవాదాయ, రెవిన్యూ, ఇంధన, ఏపీఎస్ ఆర్టీసీ, అన్న క్యాంటీన్, పీజీఆర్సీ, సీడీఎంఏ తదితర ఏడు శాఖలకు సంబంధించి 158 సేవలు అందుబాటులోకి తేవడం జరిగిందని, మిగిలిన శాఖలకు సంబంధించి మరో 500లకు పైగా సేవలను అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. ప్రజల కోరికలు, డిమాండ్లు, అభిప్రాయాలను తెలుసుకునేందుకు కూడా ఈ వాట్సప్ సేవలను భవిష్యత్తులో అన్ని శాఖలు వినియోగించాలని, ఈ యాప్ ద్వారా ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |