ఢిల్లీ లిక్కర్ స్కాం కంటే 10 రెట్లు ఎక్కువ పెద్ద స్కాం ఏపీలో వైసీపీ హయాంలో జరిగిందని బీజేపీ ఎంపీ సీఎం పార్లమెంట్ వేదికగా విమర్శలు గుప్పించారు. లోక్ సభలో జీరో అవర్ సందర్భంగా.. ఎంపీ రమేష్ ఏపీ లిక్కర్ పాలసీ అంశాన్ని ప్రస్తావించారు. 2019-2024 మధ్య ఏపీ లిక్కర్ పాలసీని మార్చారని గుర్తు చేశారు. వైసీపీ హయాంలో మద్యం అమ్మకాలు కేవలం నగదు రూపంలోనే జరిగాయని.. ఒక్కటి కూడా డిజిటల్ లావాదేవీలు జరగలేదని ఆయన తెలిపారు.
మద్యాన్ని ప్రైవేటు షాపుల నుంచి ప్రభుత్వ దుకాణాలకు అప్పగించారని ఎంపీ గుర్తు చేశారు. ఐదేళ్లలో రూ.లక్ష కోట్లకు పైగా మద్యం అమ్మకాలు జరిగాయని చెప్పారు. మద్యం షాపుల సిబ్బందిని సైతం ఒప్పంద పద్ధతిలోనే నియమించారన్నారు. అయితే ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతుండగా.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మధ్యలో జోక్యం చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రమేష్ బీజేపీ కోసం పనిచేయడం లేదని.. టీడీపీకి పనిచేస్తున్నాడని విమర్శించారు. సీఎం రమేష్ నిరాధార ఆరోపణలు చేస్తున్నాడని ఫైర్ అయ్యారు. చంద్రబాబు నుంచి కాంట్రాక్టులు పొందడానికే.. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడని మండిపడ్డారు. అలానే మార్గదర్శి స్కాం చాలా పెద్ద కుంభకోణమని ఎంపీ మిథున్ రెడ్డివ్యాఖ్యానించారు. ఎంపీల కామెంట్స్ తో ఏపీ లిక్కర్ వ్యవహారం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.