ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావలసిన నిధులు విడుదల చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి కేంద్ర మంత్రులను కోరారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో కేంద్ర సామాజిక న్యాయ మరియు సాధికారత శాఖ మంత్రి డా.వీరేంద్ర కుమార్, సహాయ మంత్రి రామ్ దాస్ అథవాలేతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా, పీఎం అజయ్ ఆదర్శ గ్రామ్ స్కీం కింద రాష్ట్రంలో ఎంపిక చేసిన 526 గ్రామాలకు రూ.110 కోట్లు విడుదల చేయాలని కోరారు. 75 సాంఘిక సంక్షేమ నూతన వసతి గృహాల నిర్మాణానికి రూ.245 కోట్లు, పీఎం అజయ్ కింద డా.బి ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.193 కోట్లు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ బాధితులకు పరిహారం నిధులు రూ.95.84 కోట్లు విడుదల చేయాలని కోరారు.
దివ్యాంగ విద్యార్థుల కోసం ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో మూడు హాస్టల్స్ నిర్మించాలని, 23 ఏళ్ళు దాటిన దివ్యాంగులకు వసతి గృహాల్లో ఉండేందుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించాలని మంత్రి డోలా కేంద్ర మంత్రులను కోరారు. వీటన్నింటికి వారు సానుకూలంగా స్పందించారని, ఆంధ్రప్రదేశ్‌కు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని వారు హామీ ఇచ్చినట్లు మంత్రి డోలా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.