దేశ రాజధాని దిల్లీ అసెంబ్లీ అధికార పీఠాన్ని కైవసం చేసుకునేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ హోరాహోరీగా తలపడ్డాయి. ఫిబ్రవరి 2న దిల్లీ అసెంబ్లీలోని 70 సీట్లకు ఎన్నికలు పూర్తవ్వగా.. దేశంలోని వివిధ ప్రముఖ సర్వే సంస్థలు దిల్లీ ఎన్నికలపై సర్వే నివేదికలను విడుదల చేశాయి.
దేశంలో పేరున్న సర్వే సంస్థలు.. రాజధాని ప్రజలు అధికారాన్ని పదేళ్లుగా అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి కట్టబెట్టాయా, లేదా కేంద్రంలోని అధికార భాజపాకు అప్పగించేందుకు సిద్ధమయ్యారా అనే విషయాలపై క్షేత్ర స్థాయిలో సర్వే సంస్థలు సర్వే చేశాయి. ఇందులో.. మెజార్టీ సర్వే సంస్థలు ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీకి మధ్య గట్టి పోటీ ఉంటుందని తెలిపాయి. అయితే..వాటిలో చాలా వరకు దిల్లీ పీఠం కమలనాథులే కైవసం చేసుకుంటారనే అంచనాల్ని విడుదల చేశాయి.
దీల్లీ అసెంబ్లీలో మొత్తం 70 సీట్లు ఉన్నాయి. ఇక్కడ అధికారం చేపట్టాలంటే మ్యాజిక్ ఫిగర్ 36 స్థానాలు సాధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏ పార్టీ ఈ మ్యాజిక్ ఫిగర్ ను అందుకుంటుంది అనే విషయమై.. అనేక ఊహగానాల వ్యక్తం అవుతుండగా, సర్వే సంస్థల అంచనాలు ఇలా ఉన్నాయి.
సర్వే సంస్థ ఆప్ బీజేపీ కాంగ్రెస్
మ్యాట్రిజ్ 32- 37 35- 40 0-1
పీపుల్స్ ఇన్ సైడ్ 25-29 40-44 0-1
రిపబ్లిక్ P మార్క్ 21-31 39-49 0-1
కేకే సర్వే 39 22 9
టైమ్స్ నౌ 22-31 39-45 0-2
పీమార్క్ 31-31 39-49 0-1
పీపుల్స్ పల్స్ 10-19 51-60 0
చాణక్య స్ట్రాటజీస్ 25-28 39-44 2-3
పోల్ డైరీ 18-25 42-50 0-2
డీవీ రీసెర్చ్ 26-34 36-44 0
వీ ప్రిసైడ్ 46-52 18-23 0-1
జేవీసీ 22-31 39-45 0-2
దాదాపు రెండు దశాబ్దాలుగా అధికారానికి దూరంగా ఉంటూ వస్తున్న బీజేపీ ఈసారి ఎలాగైనా దిల్లీ పీఠాన్ని దక్కించుకునేందుకు గట్టిగా ప్రయత్నించింది. రెండు సార్లుగా క్లీన్ స్వీప్ చేస్తూ దిల్లీలో అధికారం చెలాయిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ ముచ్చటగా మూడోసారి అధికారం కోసం తీవ్రంగా శ్రమించింది. ఇక.. గతంలో దిల్లీలో మంచి ప్రజాదరణ పొంది.. వరుసగా దిల్లీ ఎన్నికల్ని గెలుచుకుంటూ వస్తున్న కాంగ్రెస్ సైతం సత్తా చాటాలని ప్రయత్నించింది.
కానీ.. ఆమ్ ఆద్మీ పార్టీపై అవినీతి ముద్ర, పాలనపై పట్టు తప్పడంతో దిల్లీ ప్రజల్లో ఆమ్ ఆద్మీ పార్టీపై నమ్మకం సన్నగిల్లింది అంటున్నాయి సర్వేలు. పైగా.. కేంద్రంలో మూడో దఫా బీజేపీ అధికారంలో ఉంటుండడంతో దిల్లీ ప్రజలు బీజేపీ వైపు మొగ్గారని తెలుపుతున్నాయి. ఒకటి, రెండు సర్వే సంస్థలు మినహా.. దాదాపు అన్ని సర్వేలు.. భారతీయ జనతా పార్టీకి అధికారం దక్కవచ్చనే అభిప్రాయానికి వచ్చేశాయి. కాగా.. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో తీవ్ర వెనుకంజ వేసినట్లుగా తాజా సర్వే రిపోర్టులు స్పష్టం చేస్తున్నాయి.
నరేంద్ర మోదీ, జేపీ నడ్డాలతో పాటుగా కేంద్రంలోని పెద్దలంతా డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే బాగుంటుందని గట్టిగా ప్రచారం చేసాయి. అభివృద్ధి రెండు రెట్లు వేగంగా పరుగులు పెడుతుందంటూ ప్రజల్లోకి తీసుకెళ్లారు. దీంతో.. ఇప్పటికే రెండు దఫాలుగా ఆమ్ ఆద్మీ పార్టీ పరిపాలన చూస్తుండడం, వరుసగా కీలక నాయకులపై అవినీతి మరకలు పడడంతో ప్రజలంతా మూకుమ్మడిగా బీజేపీ వైపు ఆకర్షితులైనారని అంటున్నారు.