ఈసారి జగన్ 2.0ని చూస్తారని… కార్యకర్తల కోసం జగన్ ఎలా పని చేస్తాడో చూపిస్తానని వైసీపీ అధినేత జగన్ అన్నారు. తొలి విడతలో ప్రజల కోసం పని చేశానని… ఆ క్రమంలో కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వలేకపోయానని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో వైసీపీ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. జగన్ 1.0లో కార్యకర్తలకు అంతగా చేసుండకపోవచ్చని… జగన్ 2.0లో వేరుగా ఉంటుందని చెప్పారు. విజయవాడ వైసీపీ కార్పొరేటర్లతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
జగన్ 1.0లో ప్రతి పథకం, ప్రతి విషయంలో మొట్టమొదట ప్రజలే గుర్తుకొచ్చి, వారి కోసం తాపత్రయపడ్డానని జగన్ తెలిపారు. ఇప్పుడు చంద్రబాబు మన కార్యకర్తలను పెడుతున్న ఇబ్బందులను చూశానని… మీ అందరికీ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా తనను గుర్తుకు తెచ్చుకోవాలని… తనను 16 నెలలు జైల్లో పెట్టారని… తనపై కేసులు పెట్టింది కూడా కాంగ్రెస్, టీడీపీ నాయకులేనని చెప్పారు. జైలు నుంచి బయటకు వచ్చి ప్రజల అండతో ముఖ్యమంత్రిని అయ్యానని తెలిపారు. ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పారు. 30 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉంటానని ధీమా వ్యక్తం చేశారు.
మున్సిపాలిటీల్లో టీడీపీకి బలం లేకపోయినా బెదిరింపులకు, ప్రలోభాలకు గురి చేసి టీడీపీ వైపుకు తిప్పుకుంటున్నారని జగన్ మండిపడ్డారు. కొందరు ధైర్యంగా నిలబడ్డారని, వారిని చూసి గర్విస్తున్నానని చెప్పారు. ఇచ్చిన ప్రతి హామీని మన ప్రభుత్వ హయాంలో నెరవేర్చామని… అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేశామని తెలిపారు. ఎన్నికల్లో ఓడిపోయినా తలెత్తుకుని ప్రజల దగ్గరకు వెళ్లగలమని… కానీ, టీడీపీ నేతలకు ఆ పరిస్థితి లేదని చెప్పారు.
చంద్రబాబును నమ్మడమంటే చంద్రముఖిని లేపడమేనని… పులి నోట్లో నోరు పెట్టడమేనని ఆనాడే చెప్పానని తెలిపారు. చంద్రబాబు సూపర్ సిక్స్ లు, సూపర్ సెవెన్ లని చెప్పి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. ప్రజలు కాలర్ పట్టుకుని నిలదీస్తారనే భయంతో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని విమర్శించారు.
మన ప్రభుత్వంలో ప్రతిదీ పక్కాగా జరిగిందని… చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నారనే చర్చ ప్రతి ఇంట్లో జరుగుతోందని జగన్ అన్నారు. ఇసుకను రెట్టింపు ధరలకు అమ్ముకుంటున్నారని… ప్రతి నియోజకవర్గంలో పేకాట క్లబ్ లు కనిపిస్తున్నాయని విమర్శించారు. ఇండస్ట్రీ నడపాలన్నా, మైనింగ్ చేసుకోవాలన్నా డబ్బులు ఇవ్వాల్సిందేనని… ఎమ్మెల్యే దగ్గర నుంచి చంద్రబాబు వరకు పంపకాలు జరుగుతున్నాయని ఆరోపించారు. 9 నెలల్లోనే కూటమి నేతలు దారుణంగా తయారయ్యారని అన్నారు.