ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనం కోసం టోకెన్లు/టికెట్లు ఉన్న భక్తులు తిరుమలకు బారులు తీరుతున్నారు. శ్రీవేంకటేశ్వర స్వామివారిని ఉత్తరద్వారం గుండా దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి వేలసంఖ్యలో తరలి వస్తోన్నారు.
ఆదివారం నాడు 70,966 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 15,681 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 2.95 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. భక్తులకు టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేశారు.
తిరుమలలో వసతిగదుల కేటాయింపు వ్యవస్థను మరింత పారదర్శకంగా నిర్వహించడానికి టీటీడీ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆన్‌లైన్ ద్వారా గదులను బుక్ చేసుకున్న వారికి వాట్సప్ ద్వారా సమాచారాన్ని అందజేయడానికి కసరత్తు చేపట్టింది. వసతి గదులు కేటాయింపు పూర్తి సమాచారం, రిజిస్ట్రేషన్ వివరాలను వాట్సప్ ద్వారా చేరవేసేలా మార్పులుచేర్పులు చేపట్టనుంది.
భక్తులకు మరింత నాణ్యమైన సేవలను అందించే క్రమంలో ఎప్పటికప్పుడు అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా వారు ఎదుర్కొంటోన్న ఇబ్బందులను తొలగించడానికి ప్రాధాన్యత ఇస్తోంది. పాలనాపరమైన సంస్కరణలను చేపట్టడం వల్ల క్రౌడ్ మేనేజ్‌మెంట్ మరింత మెరుగ్గా ఉంటుందని భావిస్తోంది.
శ్రీవారికి విరాళం ఇచ్చే దాతల విభాగాన్ని పూర్తిగా ఆడిట్ చేయించాలని టీటీడీ ఇదివరకే నిర్ణయించిన విషయం తెలిసిందే. అర్హులైన దాతలకు సేవలు అందేలా, మధ్యవర్తులను పూర్తిగా నిషేధించేలా ఏర్పాట్లను చేపట్టింది. పారదర్శకంగా సేవలు అందించేలా, మానవ జోక్యాన్ని తగ్గించి, భక్తులకు త్వరతిగతిన శ్రీవారి దర్శనం చేసేలా ఏర్పాట్లు చేస్తోంది.
తిరుమల, తిరుపతిల్లో గల వసతి గదుల బుకింగ్ భారీగా ఉంటోంది. తిరుపతి ప్రధాన బస్టాండ్ సమీపంలో శ్రీనివాసం, రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం వసతి భవనాలు ఉన్నాయి. ఈ రెండు చోట్లా గదులను ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.
తిరుమలలో శ్రీ పద్మావతి అతిథిగృహం, శ్రీ వేంకటేశ్వర అతిథిగృహం, రామ్ బగీచా వరాహస్వామి విశ్రాంతి భవనం, ట్రావెలర్స్ బంగ్లా, నారాయణగిరి గెస్ట్ హౌస్, నందకం, పాంచజన్యం, కౌస్తుభం, వకుళమాత, సప్తగిరి వసతి గృహాలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో ఆన్ లైన్ ద్వారా గదులను బుక్ చేసుకునే సౌకర్యం ఉంది.