తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన రేవంత్ రెడ్డి యాదాద్రి పేరును మారుస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇదే సమయంలో యాదాద్రి ఆలయ అభివృద్ధికి కూడా ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు.
యాదాద్రి పేరు మార్పు
యాదగిరిగుట్ట లోని లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని పునర్నిర్మాణం చేసి తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైన ఆలయాన్ని గత ముఖ్యమంత్రి కేసీఆర్ అందించి యాదగిరిగుట్ట పేరును యాదాద్రిగా మార్పు చేశారు. అయితే ఇప్పుడు మళ్లీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి పేరును యాదగిరిగుట్ట గా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇకనుంచి అధికారికంగా యాదగిరిగుట్ట పేరునే కొనసాగుతుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డ్ ఏర్పాటు ఆదేశం
నేడు యాదాద్రి ఆలయ అభివృద్ధి పై సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన తిరుమల టిటిడి తరహాలో యాదగిరిగుట్టలో టెంపుల్ బోర్డును కూడా ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. టీటీడీ స్థాయిలో బోర్డుకు ప్రాధాన్యం ఉండేలా పూర్తి అధ్యయనంతో యాదగిరిగుట్ట టెంపుల్ వద్దని ఏర్పాటు చేయాలని ఆయన పేర్కొన్నారు.
యాదగిరి గుట్ట విమాన గోపురం బంగారు తాపడం పనులపై రేవంత్
ఇక గోశాల సంరక్షణకు ఒక ప్రత్యేకమైన పాలసీని తీసుకురావాలని, గో సంరక్షణ కోసం రక్షణకు అవసరమైతే టెక్నాలజీని కూడా ఉపయోగించుకోవాలని సూచించారు. కొండపైన భక్తులు నిద్రించి, మొక్కలు తీర్చుకునేందుకు వీలుగా అన్ని చర్యలు చేపట్టాలని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం యాదగిరిగుట్ట లోని లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో కొనసాగుతున్న విమాన గోపురం బంగారు తాపడం పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, బ్రహ్మోత్సవాల నాటికి వీటిని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
యాదగిరిగుట్ట అభివృద్ధిపై రేవంత్ ఫోకస్
ఆలయ అభివృద్ధికి సంబంధించి పెండింగ్లో ఉన్న భూసేకరణ పూర్తి చేయాలన్నారు. దీనికోసం అవసరమైన నిధులను మంజూరు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. వారం రోజుల్లో యాదగిరిగుట్ట అభివృద్ధికి సంబంధించి పూర్తి వివరాలు సూచనలతో రావాలని, ఆలయానికి సంబంధించి అసంపూర్తిగా మిగిలిపోయిన పనులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
ఇకపై యాదాద్రి బదులుగా అన్ని రికార్డులలోనూ యాదగిరిగుట్టనే వ్యవహారంలోకి తీసుకురావాలని ఆయన అధికారులను ఆదేశించారు.