ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ కూ, ఆయన సోదరి, పీసీసీ ఛీఫ్ వైఎస్ రష్మిలకు మధ్య ఆస్తుల వివాదం కొనసాగుతోంది. దీనిపై ఓ దశలో తీవ్ర స్ధాయిలో వాగ్యుద్దం చేసుకున్న జగన్, షర్మిల కొంతకాలంగా సైలెంట్ గా ఉన్నారు. ఆస్తుల వివాదాన్ని కోర్టుల ద్వారానే పరిష్కరించుకుందామని ఇద్దరూ ఓ అంగీకారానికి వచ్చిన తర్వాత షర్మిల మౌనం వహిస్తున్నారు. అలాగే జగన్ కూడా పూర్తిగా తగ్గారు. ఈ నేపథ్యంలో ఇవాళ జగన్ ముందు షర్మిల మరో అంశంలో కొత్త డిమాండ్ పెట్టారు.
ఏపీలో త్వరలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. వీటికి హాజరయ్యేది లేదని వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ ఎమ్మెల్యేలు ఇప్పటికే తేల్చిచెప్పేశారు. దీనిపై ఇవాళ అనూహ్యంగా పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల స్పందించారు. మిగతా అంశాలన్నీ వదిలిపెట్టి కేవలం అన్నను టార్గెట్ చేసేలా సంచలన డిమాండ్ తెరపైకి తెచ్చారు. అసెంబ్లీకి వెళ్లకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేయాలని జగన్ ను షర్మిల కోరారు.
అసెంబ్లీ కి పోనీ వాళ్ళు ఎవరైనా రాజీనామా చేయాలని వైఎస్ షర్మిల తెలిపారు. అది జగన్ మోహన్ రెడ్డి అయినా, వైసీపీ ఎంఎల్ఏ లు అయినా ఎవరైనా రాజీనామా చేయాల్సిందేనంటూ షర్మిల వ్యాఖ్యానించారు. అసెంబ్లీ వెళ్ళే ధైర్యం లేకపోతే పదవులు ఎందుకు అంటూ షర్మిల ప్రశ్నించారు. ఇప్పటివరకూ ఇతరత్రా అంశాలపై జగన్ ను టార్గెట్ చేస్తున్న షర్మిల ఇప్పుడు అసెంబ్లీ, ఎమ్మెల్యే పదవి విషయంలో చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. భవిష్యత్తులో జగన్ రాజీనామా చేస్తే పులివెందులలో ఆయనకు పోటీగా నిలబడే ఉద్దేశంలో షర్మిల ఉన్నారా అన్న చర్చ తలెత్తుతోంది.