పార్లమెంట్ శీతాకాల సమావేశాల షెడ్యూల్ వచ్చింది. నవంబర్ 25న సమావేశాలు ప్రారంభమవుతాయని, డిసెంబర్ 20 వరకు కొనసాగుతాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు ఇవాళ (మంగళవారం) ఎక్స్ వేదికగా ప్రకటించారు. ‘‘ కేంద్ర ప్రభుత్వ సిఫార్సు మేరకు పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు ప్రతిపాదనకు గౌరవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. నవంబర్ 25 నుంచి డిసెంబర్ 20, 2024 వరకు శీతాకాల సమావేశాలు జరుగుతాయి’’ అని ఆయన తెలిపారు.
రాజ్యాంగం ఆమోదం పొందిన 75వ వార్షికోత్సవం సందర్భంగా నవంబర్ 26, 2024న సంవిధాన్ సదన్‌లోని సెంట్రల్ హాల్‌లో ఉభయ సభల సభ్యులతో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. కాగా ‘ఒకే దేశం, ఒకే ఎన్నికల’ ప్రతిపాదన, శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న వక్ఫ్ (సవరణ) బిల్లు-2024పై అధికార, విపక్షాల మధ్య వాడివేడిగా చర్చ జరగవచ్చని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
శీతాకాల సమావేశాల్లో వక్ఫ్ (సవరణ) బిల్లు: అమిత్ షా
వక్ఫ్ (సవరణ) బిల్లు-2024ను పార్లమెంటు శీతాకాల సమావేశాలలో ప్రవేశపెట్టి ఆమోదించనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. గుర్గావ్‌లోని బాద్‌షాపూర్ ప్రాంతంలో జరిగిన బీజేపీ ఎన్నికల ర్యాలీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో వక్ఫ్ బోర్డు చట్టాన్ని పరిష్కరిస్తామని ఆయన అన్నారు. కాగా వక్ఫ్ బిల్లు సవరణలను బీజేపీ నేత జగదాంబికా పాల్ నేతృత్వంలోని సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలించింది. అయితే జగదాంబికా పాల్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారని పార్లమెంటరీ కమిటీలో సభ్యులుగా ఉన్న ప్రతిపక్ష పార్టీల ఎంపీలు ఆరోపిస్తున్నారు.