మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తల్లి విజయమ్మ మరోలేఖను సంధించారు. అయితే, ఈ సారి ఆస్తుల గురించి కాదు. ఆమె కారు ప్రమాదం గురించి జరుగుతున్న ప్రచారంపై. గత కొద్ది రోజులుగా విజయమ్మ కారు ప్రమాదంపై సోషల్ మీడియాలో అనేక వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. తల్లిని చంపేందుకు అది జగన్ పన్నిన కుట్ర అంటూ ఆరోపణలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో విజయమ్మ స్పందించక తప్పలేదు. నిజం ఇదేనంటూ మరో లేఖను విడుదల చేశారు.
కారు ప్రమాదంపై జరుగుతోన్న ప్రచారంపై ట్విట్టర్ వేదికగా విజయమ్మ స్పందించారు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారం తనను తీవ్రంగా కలచివేస్తోందని ఆమె వెల్లడించారు. కొంతమంది లేనిపోని అసత్య కథనాలను ప్రచారం చేస్తుంటే తీవ్ర మానసిక వేదన కలుగుతోందన్నారు. తనను అడ్డంగా పెట్టుకుని నీచమైన రాజకీయాలకు పాల్పడుతున్నారని, ఇప్పుడే దాన్ని ఖండించకపోతే ప్రజలు అదే వాస్తవం అనుకొని నమ్మే ప్రమాదం ఉందని విజయమ్మ తెలిపారు.
అమెరికాలో ఉన్న నా మనవడి వద్దకు వెళ్తే.. దాన్ని కూడా తప్పుగా చిత్రీకరించారని విజయమ్మ అన్నారు. తాను భయపడి విదేశాలకు వెళ్లిపోయినట్లు దుష్ప్రచారం చెయ్యడం అత్యంత నీతిమాలిన చర్య అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఇంతగా దిగజారి ప్రవర్తించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదంటూ హితవు పలికారు. ఇలాంటి ప్రచారం, ప్రజలను తప్పుదోవ పట్టించాలనే విధానం ఏ మాత్రం సమర్ధనీయం కాదన్నారు.
ఇకపై ఇటువంటి దుష్ప్రచారాలను, వ్యక్తిత్వహనన వైఖరిని ఆపాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఈ వికృత చేష్టలను గమనిస్తూనే ఉన్నారని, సరైన సమయంలో సరైన విధంగా బుద్ధిచెబుతారన్నారు. ఇకపై ఇలాంటి అసత్యాలను ప్రచారం చేస్తే సహించబోమని విజయమ్మ హెచ్చరించారు. అయితే, తాజా లేఖతో విజయమ్మ జగన్‌కు సపోర్ట్ చెయ్యడం చర్చనీయంగా మారింది. ఆస్తుల విషయంలో తన సపోర్ట్ షర్మిళకే అంటూ విజయమ్మ ఓ లేఖతో స్పష్టత ఇచ్చిన సంగతి తెలిసిందే. విజయమ్మ లేఖ తర్వాత వైసీపీ నేతలు ఆమెను టార్గెట్ చేసుకుని కొన్ని ప్రశ్నలు కూడా స్పందించి విమర్శలు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు. వాస్తవానికి కారు యాక్సిడెంట్‌లో జగన్ కుట్ర ఉండవచ్చనే అంశాన్ని తెరపైకి తెచ్చింది టీడీపీ పార్టీనే. వారు చేసిన సోషల్ మీడియా ప్రచారం.. వైరల్ కావడంతో విజయమ్మ స్పందిచక తప్పలేదు.
ఆ నిశబ్దం వెనుక.. రాజీ ప్రయత్నాలు
ఆస్తుల గొడవలు.. కుటుంబ వ్యవహారం కాబట్టి.. వీధికి ఎక్కకుండా రాజీ కుదుర్చుకోవాలనే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. అందుకే, విజయమ్మ పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. ఈ విషయంలో వైసీపీ నేతలు కూడా సైలెంట్ కావడానికి కారణాలు ఇవేనని తెలుస్తోంది. ఏ కొడుకు తన తల్లిపై అలాంటి కుట్రకు పాల్పడడు అని, జగన్ అలాంటివాడు కాదనే స్పష్టత ఇచ్చేందుకే తల్లిగా.. బాధ్యతగా విజయమ్మ ఈ లేఖను రాశారని వైఎస్సార్ అభిమానులు అంటున్నారు. దీన్ని కూడా రాజకీయం చేయడం తగదని అంటున్నారు. ఏది ఏమైనా.. విజయమ్మ రాసిన ఈ లేఖ మరోసారి చర్చనీయంగా మారింది.