రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెట్రో రైలు విస్తరణ పనుల్లో కీలక పురోగతి చోటుచేసుకుంది. భాగ్య నగరం నలుమూలలకు మెట్రో సేవల్ని అందించేలా ప్రణాళికలు రూపొందించగా.. తాజాగా పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇప్పటి వరకు హైదరాబాద్ మహా నగరంలో కొన్ని ప్రాంతాలకే మెట్రో పరిమితమైన వేళ.. నూతన ప్రణాళికతో ఐదు నూతన కారిడార్లకు ప్రతిపాదనలు చేశారు. మొత్తంగా రెండో దశ పనులకు రూ. 24,269 కోట్లు అవసరమని అధికారులు అంచనాలు రూపొందించగా.. అందులో 30 శాతం నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వ వాటాగా సమకూర్చాల్సి ఉంటుంది. అంటే.. రూ.7313 కోట్లు. కేంద్రం సైతం ఈ ప్రాజెక్టుకు ఆర్థిక సహాయం అందించనుండగా… కేంద్రం వాటాగా 18 శాతం అంటే రూ. 4,230 కోట్లు ఖర్చు చేయనుంది.
ప్రాజెక్టులో మిగతా 52 శాతం నిధులను రుణాలతో పాటు పీపీపీ విధానంలో సమకూర్చుకునేలా ప్రభుత్వం డీపీఆర్ రూపొందించింది. నగర శివారు ప్రాంతాల నుంచి రోజు లక్షల మంది నగరంలోకి ప్రవేశిస్తుంటారు. వారికి ప్రస్తుతం మెట్రో అనుకున్న మేర సేవలు అందిచలేకపోతోంది. ఈ అంశాన్ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని.. నగరం నలుమూలలకు మెట్రో విస్తరణ జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన విధానాలతో ప్రణాళికలు రూపొందించింది.
నూతన కారిడార్లు ఇవే..
ఇప్పటి వరకు మూడు కారిడార్ల పనులు పూర్తవగా.. నాలుగో కారిడార్ గా నాగోల్ టూ శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు మెట్రో పరుగులు తీయనుంది. 35.8 కి.మీ మేరు చేపట్టనున్న నిర్మాణాలు.. ఆ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ జోరు మరింత పెంచే అవకాశాలున్నాయని అంచనాలున్నాయి. ఐదో కారిడార్ లో భాగంగా.. ఐటీ ప్రాంతాలైన రాయదుర్గ్ నుంచి కోకాపేట్ నియోపొలిస్ వరకు 11.6 కి.మీ మెట్రో నిర్మించేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. ఇక.. ఆరో కారిడార్లో ఆరో కారిడార్లో.. ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయన్ గుట్ట వరకు 7.5 కి.మీ, ఏడో కారిడార్ మియాపూర్ నుంచి పటాన్‌చెరు వరకు (13.4 .మీ), ఎనిమిదో కారిడార్ ఎల్‌బీనగర్ టూ హయత్ నగర్ వరకు 7.1 కి.మీ. మేర నూతన కారిడార్ అందుబాటులోకి రానుంది.
తీరనున్న ట్రాఫిక్ కష్టాలు..
హైదరాబాద్ కు సిటీ చుట్టు పక్కల నుంచి భారీగా రోజు వారీ కార్మికులు, ఉద్యోగాలు వస్తుంటారు. వారు నేరుగా గమ్య స్థానాలకు చేరుకునే వెసులుబాటు లేకపోవడంతో.. ఆటోలు, బస్సులో మెట్రో స్టేషన్ వరకు రావడం అక్కడి నుంచి మెట్రోలో ప్రయాణించాల్సి వచ్చేంది. మెట్రో దిగిన తర్వాత.. మళ్లీ ఆటోలు, బస్సుల్లో గమ్య స్థానాలకు వెళ్లాల్సిన పరిస్థితి. అందుకే.. నగరంలో అవసరమైన అన్ని మార్గాల్లో నూతన మెట్రోను పరుగులు తీయించాలని భావించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. ఐదు నూతన కారిడార్ల డీపీఆర్ లను సిద్ధం చేసి.. పరిపాలన అనుమతులు ఇచ్చింది.