ఏపీలో గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వం రోడ్ల దుస్థితి జాతీయ స్ధాయిలో చర్చనీయాంశమైంది. ముఖ్యంగా చిన్న చిన్న రోడ్లకు సైతం గుంతలు పూడ్చలేని పరిస్ధితి రావడంతో పొరుగు రాష్ట్రాల రాజకీయ పార్టీల నేతలు సైతం జోకులేసుకునే స్థాయికి పరిస్ధితి వెళ్లిపోయింది. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. చివరికి అధికారం పోయే సమయంలో కొన్ని చోట్ల రిపేర్లు చేయించి వదిలేసింది. అప్పట్లో వైసీపీ ప్రభుత్వంపై ఇదే అంశంపై కూటమి పార్టీలు తీవ్ర పోరాటాలు చేశాయి. ఇప్పుడు అధికారంలోకి రావడంతో కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
మిషన్ పాత్ హోల్ ఫ్రీ ఏపీ (మిషన్ గుంతల్లేని ఏపీ) పేరుతో ఓ కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం చేపడుతోంది. ఇవాళ అనకాపల్లి జిల్లా వెన్నెలపాలెంలో రహదారుల గుంతలు పూడ్చే కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొంటారు.
మిషన్ పాత్ హోల్ ఫ్రీ ఏపీ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల మరమ్మతులు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. సంక్రాంతి నాటికి గుంతల రహిత రహదారుల రాష్ట్రంగా ఏపీని తీర్చదిద్దడమే లక్ష్యంగా మిషన్ మోడ్ లో పనిచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత విజయనగరం జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినప్పటికీ, స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో అనకాపల్లి జిల్లాకు ఈ కార్యక్రమం మారింది. ప్రస్తుతానికి గుంతలు పూడ్చి ఆ తర్వాత బాగా దెబ్బతిన్న రోడ్లను పూర్తి స్దాయిలో వేసేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.