UPDATES  

NEWS

 పాదయాత్రపై కేటీఆర్ కీలక ప్రకటన..

భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నిన్న సాయంత్రం ఆయన ‘ఆస్క్ కేటీఆర్’ పేరుతో ఎక్స్ వేదికగా అభిమానులు, నెటిజన్ల ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా ఓ నెటిజన్ ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు.

 

ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టేందుకు… పార్టీని బలోపేతం చేసేందుకు ఆయా పార్టీల అధ్యక్షులు పాదయాత్రలు చేస్తున్నారని, మీరెప్పుడు చేస్తారని సదరు నెటిజన్ ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు స్పందించిన కేటీఆర్… పార్టీ కార్యకర్తల ఆకాంక్షల మేరకు రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని కీలక ప్రకటన చేశారు.

 

కాంగ్రెస్ ప్రభుత్వం పాలన ఫ్రమ్ ఢిల్లీ… టూ ఢిల్లీ… ఫర్ ఢిల్లీ అన్నట్లుగా తయారైందని ఎద్దేవా చేశారు. నాలుగేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారం పోవడం ఖాయమన్నారు. అయితే కొత్త ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వం చేసిన నష్టం నుంచి తెరుకొని ముందుకు తీసుకుపోవడం అతిపెద్ద సవాల్‌గా మారుతుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక ప్రగతి పూర్తిగా పతనమైందని విమర్శించారు.

 

అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రం వెనక్కి పోతోందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆదాయ వనరుల నుంచి మొదలు వ్యవసాయ రంగం, అన్ని రంగాలు తిరోగమనంలో ఉన్నాయన్నారు. నిరుద్యోగిత పెరిగిందన్నారు. తెలంగాణ నుంచి అనేక కంపెనీలు వెనక్కి వెళ్లిపోతున్నాయని చెప్పారు. ఈ అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయో ఎవరికీ తెలియడం లేదన్నారు. కాంగ్రెస్ పాలన వలన జరుగుతున్న నష్టాన్ని పూడ్చడం త్వరగా సాధ్యం కాదన్నారు.

 

చెరువుల సంరక్షణ పేరుతో ప్రభుత్వం పేపర్ మీద గొప్పలు చెబుతున్నప్పటికీ అసలైన ఎజెండా అవినీతి మాత్రమే అని విమర్శించారు. మూసీ బ్యూటిఫికేషన్‌కి తాము వ్యతిరేకం కాదని… లూటిఫికేషన్‌కు మాత్రమే వ్యతిరేకమన్నారు. మూసీ ప్రక్షాళన దేశంలోనే అతిపెద్ది కుంభకోణమవుతుందని జోస్యం చెప్పారు. హైడ్రా కేవలం కొందరిని మాత్రమే లక్ష్యంగా చేసుకొని పని చేస్తుందని విమర్శించారు. ఇప్పటి వరకు ఒక్క పెద్ద బిల్డర్‌ని కూడా హైడ్రా ముట్టుకోలేదన్నారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |