UPDATES  

NEWS

 తెలంగాణలో స్థానిక ఎన్నికలు ఎప్పుడో చెప్పిన మంత్రి పొన్నం ప్రభాకర్..

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు అనే దానిపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో స్థానిక సంస్థల పదవీ కాలం పూర్తి అయ్యింది. 2019 జనవరిలో గ్రామ పంచాయతీలకు, అదే ఏడాది మే నెలలో జిల్లా పరిషత్, మండల పరిషత్‌లకు ఎన్నికలు జరిగాయి. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల పదవీ కాలం పూర్తి కావడంతో, ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ తరుణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ..స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు అనే దానిపై ఒక క్లారిటీ ఇచ్చారు.

 

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం దసరా పండుగ సందర్భంగా ఎల్లమ్మ తల్లి ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ .. రాష్ట్రంలో సామాజిక, రాజకీయ, ఆర్ధిక సర్వే కోసం జీవో 18ను తీసుకొచ్చామని చెప్పారు. ఈ సర్వే 60 రోజుల పాటు (రెండు నెలలు) కొనసాగుతుందని తెలిపారు. బీసీ కుల గణనను పూర్తిగా సేకరించిన తర్వాత రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు (గ్రామ పంచాయతీ ఎన్నికలు) జరుగుతాయని పేర్కొన్నారు. కుల గణన ప్రక్రియలో రాష్ట్ర ప్రజలు అందరూ సహకరించాలని ఆయన కోరారు. కుల గణన కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రూపొందించిందని, 60 రోజుల వ్యవధిలో ప్రతి ఇంటి వివరాలను సేకరించే విధానాన్ని ఖరారు చేసినట్లు వెల్లడించారు.

 

కుల గణనలో ప్రధానంగా అయిదు అంశాలపై (కులాన్ని కూడా కలిపితే ఆరు అంశాలు) దృష్టి పెట్టాలని ప్రభుత్వం భావిస్తుందని తెలిపారు. విద్య, ఉపాధి, సామాజిక, రాజకీయ, ఆర్ధిక వెనుకబాటుతనం వంటి అంశాలపై సమగ్రమైన డేటాను సేకరించనుందని చెప్పారు. కులాల ఆధారంగా వివిధ వర్గాల వివరాలను సేకరించడం ద్వారా ప్రతి కుటుంబానికి లభిస్తున్న అవకాశాలను అంచనా వేస్తూ భవిష్యత్తులో ప్రజలకు అవసరమైన సౌకర్యాలను కల్పించడానికి చర్యలు తీసుకోవడానికి ఈ డేటా ఉపయోగపడుతుందని వివరించారు. కుల గణన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు అని మంత్రి పొన్నం క్లారిటీ ఇవ్వడంతో రెండు నెలల తర్వాత ఎన్నికలకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని భావిస్తున్నారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |