ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్నికల మేనిఫెస్టోలో మరో హామీ అమలు చేసింది. దేవాలయాల స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీని ద్వారా ఆలయాల్లో ఇక రాజకీయ, అధికార జోక్యానికి చెక్ పడనుంది. ప్రతి ఆలయంలోనూ వైదిక కమిటీ ఏర్పాటు కానుంది. పూజలు, సేవలపై కమిటీ దే తుది నిర్ణయం. దేవాలయాల ఆచార, వ్యవహారాల్లో ఆ శాఖ కమిషనర్ పెత్తనానికీ వీల్లేదని..అంతా అంతా వైదిక, ఆగమ శాస్త్రాల ప్రకారమే జరగాలని ప్రభుత్వం నిర్దేశించింది.
కూటమి ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం అమలులోకి తీసుకువచ్చింది. రాష్ట్రంలోని దేవాలయాలకు స్వయంప్రతిపత్తి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆలయ సంప్రదాయాలు, ఆగమ, వైదిక వ్యవహారాల్లో దేవాదాయ శాఖ అధికారులు..చివరకు ఆలయ ఈవోలు సైతం జోక్యం చేసుకోవడానికి వీల్లేదంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ తాజా ఆదేశాల మేరకుప్రతి దేవాలయం లోనూ కచ్చితంగా వైదిక కమిటీని నియమించాల్సి ఉంటుంది. సదరు కమిటీ సూచనలు, సలహాలను కమిషనర్ సహా అధికారులంతా అమలు చేయాలి.
ఆలయాల్లో నూతన సేవలు ప్రారంభించడం, వాటికి సంబంధించిన ఫీజులపై నిర్ణయం, కల్యాణోత్సవాల ముహుర్తాలు, యాగాలు, కుంభాభిషేకాలు, కొత్త పూజలు ప్రారంభించడంతో పాటు ఇతర ముఖ్యమైన అంశాల్లో వైదిక కమిటీ లేదా ఆలయ ప్రధాన అర్చకుల సూచనలు పాటించాలి. ముఖ్యంగా 6ఏ ఆలయాల్లో ఈవోలు వెంటనే వైదిక కమిటీలను ఏర్పాటు చేయాలి. కమిటీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైతే ఆయా ఆగమాలకు సంబంధించిన పీఠాధిపతుల సలహాలు తీసుకోవాలి. ఏ ఆలయాల ఈవోలు కూడా ఆచార వ్యవహారాలు, సేవలు, ముహుర్తాల ఖ రారు విషయాల్లో జోక్యం చేసుకోకూడదని ప్రభుత్వం నిర్దేశించింది.