జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌సీ, కాంగ్రెస్ కూటమి ఘన విజయం సాధించింది. రాష్ట్రంలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ఎన్‌సీ, కాంగ్రెస్ కూటమికి 48 స్థానాలు వచ్చాయి. దీంతో ఈ కూటమి మ్యాజిక్ ఫిగర్ దాటింది. ఈ నేపథ్యంలోనే ఎన్‌సీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్ధుల్లాను శాసనసభాపక్షనేతగా ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు.
అయితే ఈ ఎన్నికల్లో ఎన్‌సీ పార్టీ 42 అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందగా.. కాంగ్రెస్ పార్టీ ఆరు స్థానాల్లో గెలిచింది. అలాగే బీజేపీ 29 స్థానాల్లో గెలుపొందగా.. పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ మూడు సీట్లు, జమ్మూకశ్మీర్ పీపుల్ కాన్ఫరెన్స్, సీపీఐ, ఆమ్ ఆద్మీ పార్టీలు తలో ఒక్క సీటు గెలవగా.. స్వతంత్య్ర అభ్యర్థులు 7 స్థానాల్లో గెలుపొందారు.
ఇందులో నలుగురు స్వతంత్య్ర అభ్యర్థులు ఎన్‌సీ పార్టీకి మద్దతు తెలపగా.. మరో ముగ్గురు బీజేపీకి మద్దతు తెలిపారు. దీంతో ఎన్‌సీ మెజారిటీగా అవతారమెత్తింది. కూటమిలో భాగంగా ఉన్న కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం దక్కింది.
అంతకుముందు 2014 ఎన్నికల సమయంలో 87 అసెంబ్లీ సీట్లు ఉండేవి. కానీ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరగడంతో జమ్మూకశ్మీర్ రాష్ట్రంలో అసెంబ్లీ సీట్లు సంఖ్య 90కి చేరింది. గవర్నర్ కోటాలో మరో 5 నామినేటెడ్ సీట్లు ఉన్నాయి.