ఇటీవల విడుదలై రికార్డుల మోత మోగించిన చిత్రం కల్కి 2898 ఏడీ. ప్రభాస్ కెరీర్ లో ఇదొక భారీ వసూళ్ల చిత్రంగా నిలిచిపోతుంది. అయితే, ఈ సినిమాలో ప్రభాస్ ను చూస్తే తనకు జోకర్ లా అనిపించాడని బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ వ్యాఖ్యానించాడు.
కల్కి చిత్రంలో ప్రభాస్ లుక్ జోకర్ లా అనిపించిందని, మెల్ గిబ్సన్ లా గంభీరంగా కనిపించాల్సిన ప్రభాస్ అందుకు భిన్నంగా కనిపించేసరికి తనకు చాలా బాధగా అనిపించిందని పేర్కొన్నాడు. ప్రభాస్ ను మ్యాడ్ మ్యాక్స్ సినిమా తరహాలో చూడాలనుకుంటున్నానని, కానీ కల్కి చిత్రంలో ఆయన వేషధారణ ఎందుకు అలా ఉందో అర్థం కావడంలేదని అర్షద్ వార్సీ పేర్కొన్నాడు. ప్రభాస్… నా అభిప్రాయం చెప్పడానికి చాలా బాధపడుతున్నాను అంటూ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
అయితే అర్షద్ వార్సీ వ్యాఖ్యలపై ప్రభాస్ అభిమానులు మండిపడుతున్నారు. కుళ్లు, అహంకారం వంటి లక్షణాలను బాలీవుడ్ ఇంకా వదిలించుకున్నట్టు లేదని కొందరు అభిమానులు వ్యాఖ్యానించారు. అందుకే బాలీవుడ్ వెనుకబడిపోయిందని కొందరు నెటిజన్లు పేర్కొన్నారు.
అర్షద్ వార్సీ బాలీవుడ్ లో ఎక్కువగా సహాయ నటుడి పాత్రలు పోషిస్తుంటాడు. గతంలో వచ్చిన ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’ లో సంజయ్ దత్ అనుచరుడిగా ‘సర్క్యూట్’ పాత్ర పోషించింది అర్షద్ వార్సీనే.
తెలుగులో ఈ సినిమాను చిరంజీవి హీరోగా శంకర్ దాదా ఎంబీబీఎస్ గా తీశారు. ఇందులో అర్షద్ వార్సీ పాత్రను శ్రీకాంత్ పోషించాడు. హిందీలో ఈ పాత్ర పేరు సర్క్యూట్ కాగా, తెలుగులో దీన్ని ఏటీఎంగా మార్చారు.