తెలంగాణలోని 72 శాతం మంది ప్రజలు రేవంత్ రెడ్డి ప్రభుత్వ పనితీరుపై సంతృప్తిగా ఉన్నారని ‘పల్స్ ఆఫ్ పీపుల్’ సర్వేలో వెల్లడైంది. ఈ సర్వేను తెలంగాణ కాంగ్రెస్ నేతలు స్వాగతించారు. తమ పార్టీ ఇచ్చిన హామీలను చిత్తశుద్ధితో అమలు చేస్తోందని, తమ ప్రభుత్వం పని తీరుకు ఈ సర్వే నిదర్శనమని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
ఇటీవల ‘అగ్ని న్యూస్ సర్వీస్’ 8 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరుపై సర్వేను నిర్వహించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ఈ ప్రభుత్వం అమలు చేస్తోందని సర్వేలో పాల్గొన్న ఎక్కువమంది ప్రజలు వెల్లడించారు. ఈ సర్వేపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ‘ఐఏఎన్ఎస్’తో మాట్లాడుతూ… ప్రజల నుంచి సానుకూల స్పందన వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ క్రెడిట్ అంతా రేవంత్ రెడ్డి ప్రభుత్వానిదే అన్నారు. ప్రభుత్వం తమ పార్టీ అగ్రనాయకత్వం మార్గదర్శకత్వంలో ముందుకు సాగుతోందన్నారు.
‘పల్స్ ఆఫ్ పీపుల్ ఇన్ తెలంగాణ’ పేరుతో నిర్వహించిన సర్వేలో 72 శాతం మంది కాంగ్రెస్ పాలన పట్ల సంతృప్తి వ్యక్తం చేయగా, 21 శాతం మంది అసంతృప్తిగా ఉన్నట్లు తెలిపారు. సర్వేలో పాల్గొన్న వారిలో 7 శాతం మంది ఏమీ చెప్పలేమని వెల్లడించారు.
సర్వేలో పాల్గొన్న వారిలో 55 శాతం మంది రేవంత్ రెడ్డి పనితీరు చాలా అద్భుతంగా ఉందన్నారు. 7 శాతం మంది చాలా బాగుందన్నారు. 10 శాతం మంది బాగుందని చెప్పారు. ఎనిమిది శాతం మంది మాత్రం బాగాలేదని చెప్పగా, ఇరవై శాతం మంది ఏమీ చెప్పలేమన్నారు.
అగ్ని న్యూస్ సర్వీస్ ప్రతినిధి ఆర్ సురేశ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం… ఈ సర్వేను ఆగస్ట్ 1 నుంచి ఆగస్ట్ 10 మధ్య నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 9,665 శాంపిల్స్ తీసుకున్నారు. తెలంగాణలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో ఈ సర్వే నిర్వహించారు.
ఉద్యోగులు, వ్యాపార వర్గాలు, శ్రామిక వర్గాలు, విద్యార్థులు, పురుషులు, మహిళలు పాల్గొన్నారు. ఎనిమిది నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు అంచనాలకు మించిందని సురేశ్ కుమార్ తెలిపారు. రేవంత్ రెడ్డి రాణించగలరా? అనే భయాలు అన్ని వర్గాల్లో కనిపించాయని, కానీ సర్వే ఫలితాల్లో ప్రజలు సంతృప్తిగా ఉన్నట్లు తేలిందన్నారు.