పశ్చిమబెంగాల్ లోని కోల్ కతాలో ఉన్న ఆర్ జీ కర్ బోధనా ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్ పై రేప్, హత్య ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. ఈ ఘటనకు నిరసనగా దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇప్పటికే వైద్యులు విధులు బహిష్కరించి నిరసనలకు దిగుతున్నారు. ఈ ఘటనకు కారకుల్ని పట్టుకోవడంలో బెంగాల్ పోలీసులు విఫలం కావడంతో కలకత్తా హైకోర్టు సీబీఐ దర్యాప్తుకు ఆదేశించింది. ఆదివారం లోగా సీబీఐ నిందితుల్ని పట్టుకోకపోతే తాను రోడ్లపైకి వచ్చి నిరసన ర్యాలీ చేపడతానని సీఎం మమతా బెనర్జీ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) కీలక పిలుపునిచ్చింది.
కోల్ కతాలో ట్రైనీ డాక్టర్ ఘటనకు నిరసనగా రేపు ఒక్కరోజు దేశవ్యాప్తంగా డాక్టర్లంతా విధులు బహిష్కరించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. అన్ని ఆస్పత్రుల్లోనూ ఓపీ సేవల్ని బహిష్కరించాలని పిలుపునిచ్చింది. అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో విధులు బహిష్కరించి నిరసనలకు దిగుతున్న డాక్టర్లు పూర్తిస్దాయిలో విధులకు దూరంగా ఉండిపోనున్నారు.
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని ఆస్పత్రుల్లోనూ శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకూ 24 గంటల పాటు ఎమర్జెన్సీ మినహా అన్ని సేవల్ని బహిష్కరించాలని డాక్టర్లకు ఐఎంఏ పిలుపునిచ్చింది. ఓపీడీ సేవలతో పాటు ఎలక్టివ్ సర్జరీలు కూడా చేయకుండా డాక్టర్లు దూరంగా ఉండాలని నిర్ణయించారు. దీని ప్రభావం రోగులపై తీవ్రంగా పడబోతోంది. తమ డాక్టర్లపై దేశవ్యాప్త సానుభూతి కోరుకుంటున్నట్లు ఐఎంఏ ఓ ప్రకటనలో తెలిపింది.