రాష్ట్ర రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం తీపి కబురుచెప్పింది. రుణమాఫీకి సంబంధించి మూడో విడత నిధులను విడుదల చేసింది.మూడో విడతలో 14 లక్షల 45 వేల రైతుల ఖాతాలకు రుణమాఫీ నిధులను విడదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. రూ. లక్షా 50 వేల నుంచి 2 లక్షల వరకు రుణం ఉన్న రైతులకు వర్తించనున్నది. ఇప్పటికే 2 విడతల్లో రూ. లక్షన్నర వరకు పంట రుణాలను మాఫీ చేసింది. ఈ రెండు విడతల్లో రూ. 12 వేల కోట్లను రుణమాఫీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం.
ఈ సందర్భంగా వైరాలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘వరంగల్ డిక్లరేషన్ లో భాగంగా రుణమాఫీ చేస్తున్నాం. రుణమాఫీ అసాధ్యమని కొందరు వక్రభాష్యం చెప్పారు. రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసి చూపిస్తున్నాం. సాంకేతిక కారణణాలతో కొందరికి రుణమాఫీ అందట్లేదు. అలాంటి వారిని గుర్తించి రుణమాఫీ అమలు చేస్తాం. కలెక్టరేట్లలో కౌంటర్లు ఏర్పాటు చేసి రుణమాఫీ సమస్యలు పరిష్కరిస్తాం.
రుణమాఫీ అమలుతో మా జన్మ ధన్యమైందని భావిస్తున్నాం. ఎంతమంది అడ్డుకున్నా రుణమాఫీ చేశాం. రుణమాఫీ విషయంలో హరీశ్ రావు సవాల్ విసిరారు. రుణమాఫీ చేస్తే హరీశ్ రావు రాజీనామా చేస్తానన్నారు. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేశాం. హరీశ్ రావుకు సిగ్గుంటే రాజీనామా చేయాలి. రాజీనామా చేయకుంటే అమరవీరుల స్థూపం వద్ద ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి. గత ప్రభుత్వంలో రైతులకు గిట్టుబాటు ధర లేదు. గిట్టుబాటు ధర అడిగిన రైతులకు బేడీలు వేశారు. గిట్టుబాటు అడిగిన రైతులకు బేడీలు వేసిన చరిత్ర బీఆర్ఎస్ ది. గత కాంగ్రెస్ పాలనలో ప్రతి పేదవాడికి ఇళ్లు ఇచ్చాం. డబుల్ బెడ్ రూమ్ పేరుతో బీఆర్ఎస్ మోసం చేసింది. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ప్రజలు బుద్ధి చెప్పారు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ప్రజలు తిరస్కరించారు. సాగునీటి ప్రాజెక్టులపై బీఆర్ఎస్ అలసత్వం వహించింది
అర్హులైన అందరికీ రైతుభరోసా అందిస్తాం. గత ప్రభుత్వం అనర్హులకు రైతు బంధు ఇచ్చింది. త్వరలో రైతుభరోసా పథకాన్ని ప్రారంభించబోతున్నాం. ఈ ఏడాది నుంచి ఫసల్ బీమాలో చేరాలని నిర్ణయించాం. సన్నరకం వరిసాగును ప్రోత్సహించేందుకు రూ. 500 బోనస్ చెల్లిస్తాం. రూ. 500 బోనస్ కు 33 రకాల వరిధాన్యాలను గుర్తించాం. మా ప్రభుత్వానికి రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. ఇరుగు, పొరుగు రాష్ట్రాలు, కేంద్రంతో సఖ్యతగా ఉన్నాం. ఏపీ సీఎంతో జరిపిన చర్చలు మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాం.
రాష్ట్రానికి పెట్టుబడుల కోసం జరిపిన అమెరికా, దక్షిణ కొరియా పర్యటన విజయవంతమయ్యాయి. 19 అగ్రశ్రేణి కంపెనీలతో చర్చలు జరిపాం. రూ. 31,532 కోట్ల పెట్టుబడల ఒప్పందాలు జరిగాయి. దీంతో 30 వేల మందికి పైగా ఉద్యోగవకాశాలు వస్తాయి’ అంటూ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
అదేవిధంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ‘దేశచరిత్రలో తొలిసారి రూ. 2 లక్షల రుణమాఫీ చేశాం. వ్యవసాయపరంగా, పారిశ్రామికపరంగా కీలక అడుగులు వేస్తున్నాం. ఇచ్చిన మాట ప్రకారం సంకల్పాన్ని నిజం చేశాం. ఆర్థిక మంత్రిగా రుణమాఫీ బాధ్యత తీసుకోవడం ఆనందంగా ఉంది. ఒకేసారి రుణమాఫీ సాధ్యంకాదని అందరూ అన్నారు. కానీ, ఇప్పుడు ఆ రుణం తీర్చే అవకాశం రావడం నా అదృష్టం. కేసీఆర్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తే, ఆ డబ్బులు వడ్డీలకే సరిపోయాయి. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా, దక్షిణ కొరియా పర్యటనల్లో పెట్టుబడులకు సంబంధించి కీలక ఒప్పందాలు కుదిరాయి. రూ. 36 వేల కోట్ల పెట్టుబడులను సీఎం తీసుకువచ్చారు. ఖమ్మం జిల్లాకు నీళ్లు రాకుండా చేయాలని బీఆర్ఎస్ కుట్రలు చేసింది’ అంటూ ఆయన అన్నారు.