లక్షలాది అమరుల త్యాగాల ద్వారా లభించిన స్వాతంత్య్ర దినోత్సవాన్ని వేడుకగా జరుపుకుంటున్నామన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. వేడుకలు జరుపుకుని ఆనందించడం సరిపోదని, ప్రతీ ఒక్కరూ దేశం పట్ల తమ బాధ్యతను గుర్తుచేసుకోవాల్సిన రోజన్నారు. సమర యోధుల బాటలో కుల, మత, ప్రాంతాలకు అతీతంగా సుపరిపాలనను అందిస్తున్నామన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సూపర్-6 పథకాల అమలు షణ్ముఖ వ్యూహంతో ముందుకెళ్తు న్నామని గుర్తుచేశారు. సామాజిక పింఛన్ల మొత్తాన్ని పెంచామని, ఉచితంగా ఇసుక అందిస్తున్నట్లు తెలిపారు. డొక్కా సీతమ్మ పేరిట స్కూళ్లలో మధ్యాహ్న భోజనం, ఎన్టీఆర్ స్ఫూర్తితో పేదలకు రూ.5కే భోజనం కార్యక్రమాలు అమలు చేస్తున్నామని వెల్లడించారు.
కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. మొట్టమొదటిసారి డిప్యూటీ సీఎం హోదాలో మువ్వన్నెల జెండాను ఆవిష్కరించి, ప్రసంగించారాయన. గడిచిన ఐదేళ్లలో రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించడం, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్న మైందన్నారు. శేషాచలం అడవుల్లో కొట్టేసిన ఎర్ర చందనం కర్ణాటకలో అమ్ముకున్నారని గుర్తు చేశారు. అలాంటివారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేదన్నారు.
రాష్ట్రంలో ఆడపిల్లల జోలికి ఎవరు వచ్చినా ఊరుకునేది లేదన్నారు. ఇదే విషయాన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో చెప్పామన్నారు. యువతకు ఉపాది అవకాశాలు కల్పించడం మాటల్లో కాదు, చేతల్లో చేసి చూపిస్తామన్నారు.