2019 ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏను రద్దు చేసింది. పార్లమెంటులో ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత కేంద్రపాలిత ప్రాంతం జమ్ము కశ్మీర్‌లో తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు జమ్ము కశ్మీర్‌లో ఎన్నికలు జరగలేవు. కానీ, త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని వార్తలు వస్తున్నాయి. జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు ఆగస్టు 20వ తేదీ ఎన్నికల షెడ్యూల్ వెలువడే చాన్స్ ఉన్నదని ఈసీ వర్గాలు తెలిపాయి. అక్టోబర్, నవంబర్‌లో ఆరు దశల్లో జమ్ము కశ్మీర్‌లో ఓటింగ్ జరిగే అవకాశం ఉన్నదని పేర్కొన్నాయి.
జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలే అజెండాగా కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లాతో ఎన్నికల సంఘం బుధవారం సమావేశం కానుంది. ఇటీవలే జమ్ము కశ్మీర్‌లో పర్యటించి కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు జ్ఞానేశ్వర్ కుమార్, సుక్వీర్ సింగ్ సంధులు ఎన్నికల సమీక్షను నిర్వహించారు.
గత డిసెంబర్‌లో సుప్రీంకోర్టు ఎన్నికల సంఘానికి కొన్ని సూచనలు చేసింది. జమ్ము కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు సెప్టెంబర్ కల్లా నిర్వహించాలని సూచించింది. ఎన్నికల సంఘం కూడా ఇందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నది. జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కూడా ఈ వార్తల నేపథ్యంలో స్పందిస్తూ.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా.. జమ్ము కశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ తర్వాత ఎన్నికలు నిర్వహిస్తామని ఇది వరకే చెప్పారని గుర్తు చేశారు. జమ్ము కశ్మీర్‌లో కూడా పారదర్శకంగా ఎన్నికలు నిర్వహి స్తామని వివరించారు. గత లోక్ సభ ఎన్నికల్లో జమ్ము కశ్మీర్‌లో 50 శాతానికి మించి పోలింగ్ నమోదైందని, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తే కూడా ప్రజలు క్రియాశీలకంగా పాల్గొంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో త్వరలోనే జమ్ము కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగొచ్చని తెలుస్తున్నది.