ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి కీలక అడుగు పడింది. అమరావతికి ఆర్థిక సహకారంపై ప్రపంచబ్యాంకు టీమ్.. సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యింది. త్వరలో రుణ మంజూరు పై స్పష్టత రానుంది. అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ రాగాలే పనులు శరవేగంగా మొదలుకానున్నాయి.
నలుగురు సభ్యుల వరల్డ్ బ్యాంక్ టీమ్ ఏపీ రాజధాని అమరావతిలో పర్యటిస్తోంది. మూడురోజుల పర్యటన లో భాగంగా తొలుత సోమవారం సచివాలయంలో సీఎం చంద్రబాబుతో సమావేశమైంది. ఆ తర్వాత రాజధాని ప్రాంతాన్ని పరిశీలన చేయనుంది. అమరావతిలో ఇప్పటివరకు జరిగిన పనుల గురించి అడిగి తెలుసుకుంది. అమరావతిని ప్రపంచస్థాయి సిటీగా తీర్చి దిద్దేందుకు చేపడుతున్న పనులను తెలిపారు. కేంద్రప్రభుత్వం అధిస్తున్న సహకారాన్ని వివరించారు.
ముఖ్యంగా రాజధాని నిర్మాణానికి ప్రపంచబ్యాంకు రుణ సహకారంపై వారి మధ్య చర్చ జరిగింది. 2050 నాటికి అమరావతి జనాభా దాదాపు 35 లక్షలకు చేరుతుందన్నది ఓ అంచనా. అక్కడ నివసించేవారికి ప్రపంచస్థాయి ప్రమాణాలతో కూడిన మౌళిక సదుపాయాలు కల్పించేందుకు నిధులు రుణంగా ఇవ్వాలని అధికారులు ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. అమరావతి మొత్తం ప్రాంతంలో 20 శాతం పార్కులు, గ్రీన్ ఏరియాగా మార్చుతామని తెలిపారు సీఎం.
అమరావతిలో డ్రైనేజీ, రోడ్లు కనెక్టివిటీ, విద్యుత్, మంచినీరు ఇలా రకరకాల సదుపాయాలు ఉన్నతస్థాయి ప్రమాణాలతో కూడిన సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చేందుకు ఆలోచన చేసినట్టు తెలిపారు సీఎం చంద్రబాబు. మొదటి దశలో 15000 కోట్ల కావాలన్నది ఏపీ ప్రభుత్వం అంచనా. 2019కి ముందు అమరావతి నిర్మాణానికి రుణం ఇచ్చేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అప్పుడు కీలకంగా వ్యవహరించిన రఘు కేశవన్ ప్రస్తుత పర్యటనలో ఉండడంతో అమరావతికి మంచిరోజులు వస్తాయని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.