భారత ప్రధానిగా మోదీ ప్రమాణస్వీకారం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ఆయన ప్రమాణస్వీకారం చేశారు. మోదీ తరువాత పలువురు ఎంపీలు కేంద్రమంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. వీరిలో తెలంగాణకు చెందిన ఎంపీలు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు కూడా ఉన్నారు. ముందుగా కిషన్ రెడ్డి చేశారు. ఆ తరువాత బండి సంజయ్ చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్రమంత్రులుగా ప్రమామణ స్వీకారం చేయడంతో వారికి కుటుంబ సభ్యులు, తెలుగు ప్రజలు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డి రెండోసారి ప్రమాణస్వీకారం చేశారు. బండి సంజయ్ మాత్రం కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఇదే తొలిసారి.
కరీంనగర్ కు చెందిన బండి సంజయ్ బాల్యం నుంచే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తగా ఉన్నారు. సరస్వతీ శిశుమందిర్ లో విద్యాభ్యాసం చేసిన బండి సంజయ్ తొలి నుంచి హిందూత్వ బాటలోనే నడిచారు. 1992లో అయోధ్య కరసేవకుడిగా పనిచేసిన ఆయన ఎల్ కే అద్వానీ సురాజ్ రథయాత్ర సమయంలో వాహన బాధ్యుడిగా పనిచేశారు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పార్టీ పనుల నిమిత్తం ఢిల్లీకి వచ్చిన తొలినాళ్లలో ఆయన సహాయకుడిగా ఉన్నారు. భారతీయ జనతా యువమోర్చా పట్టణ ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షుడిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా.. రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా.. జాతీయ కార్యవర్గ సభ్యుడిగా పని చేశారు. పలు రాష్ట్రాలకు ఇన్ చార్జిగా పనిచేశారు. 2020 మార్చిలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించి.. 2023 జులై వరకు కొనసాగారు. ఆ సమయంలో పార్టీ బలోపేతానికి కృషి చేశారు. జులైలో పార్టీ అధిష్టానం ఆయనను ఆ పదవి నుంచి తప్పించి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించింది.