ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల వేళ పోస్టల్ బ్యాలెట్ల చెల్లుబాటు వ్యవహారం కాకరేపుతోంది. రాష్ట్రంలో ఈసారి నమోదైన పోస్టల్ బ్యాలెట్ల డిక్లరేషన్ పై ఆర్వో సంతకం ఉంటే సరిపోతుందని, సీల్, హోదా వివరాలు అక్కర్లేదంటూ ఈసీ తీసుకున్న నిర్ణయంపై వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. ఇవాళ వాదనలు పూర్తి చేసింది. రేపు దీనిపై తీర్పు వెలువరించనుంది. అయితే ఎగ్జిట్ పోల్స్ వెలువరిస్తున్న వేళ హైకోర్టు తీర్పు రానుంది.
రాష్ట్రంలో ఈసారి ఎన్నడూ లేనంత స్ధాయిలో భారీగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్ జరిగింది. దీంతో ఇది కచ్చితంగా తమకు వ్యతిరేకంగా ఉందని భావిస్తున్న అధికార వైసీపీ.. ఇందులో లొసుగుల్ని వెతికేపనిలో పడింది. అదే సమయంలో ఈసీ పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ పై ఆర్వో సంతకం ఉంటే సరిపోతుందని, సీల్, హోదా వివరాలు అవసరం లేదని తేల్చేయడంతో ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా ఇక్కడే ఎందుకు మినహాయింపు ఇచ్చారంటూ ఈసీ నిర్ణయంపై హైకోర్టును ఆశ్రయించింది.
ఇవాళ హైకోర్టులో పోస్టల్ బ్యాలెట్ల చెల్లుబాటు వ్యవహారంపై వాడీవేడిగా వాదనలు సాగాయి. అనంతరం రేపు సాయంత్రం 6 గంటలకు తీర్పు వెలువరిస్తామని హైకోర్టు తెలిపింది. అయితే రేపు సాయంత్రం 6 గంటలకు ఎన్నికల పోలింగ్ పై ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి. అదే సమయంలో హైకోర్టు తీర్పు కూడా వస్తే దీనిపై వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాల్సి ఉంది. ముఖ్యంగా ఎగ్జిట్ పోల్స్ వైసీపీకి అనుకూలంగా ఉంటాయా, ప్రతికూలంగా ఉంటాయా అన్న చర్చ కూడా జరుగుతోంది.








