ఏపీలో ఈసారి సార్వత్రిక ఎన్నికల సందర్బంగా చోటు చేసుకున్న హింస, అనంతరం చోటు చేసుకుంటున్న పరిణామాలు పోలీసుల్ని కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలు, అనంతరం వెలువడిన నిఘా హెచ్చరికలతో పోలీసులు అప్రమత్తం అవుతున్నారు. జూన్ 4న కౌంటింగ్ డేకు ముందు, ఆరోజు, ఆ తర్వాత రోజు హింస చెలరేగే అవకాశం ఉందన్న హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా కార్డన్ సెర్చ్ లు, మాక్ డ్రిల్స్ చేపట్టారు.
రాష్ట్రవ్యాప్తంగా కార్డన్ సెర్చ్ లతో పాటు మాబ్ ఆపరేషన్ మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నట్లు డీజీపీ కార్యాలయం ఇవాళ ప్రకటించింది. శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడే లక్ష్యంగా ఈ డ్రిల్స్ చేపడుతున్నట్లు డీజీపీ హరీష్ గుప్తా తెలిపారు. ఈ తనిఖీలు, డ్రిల్స్ లో భాగంగా ప్రతీ జిల్లా పరిధిలో ఉన్న ముఖ్యమైన కూడళ్లు, గ్రామశివార్లు, అనుమానిత వ్యక్తులు, పాత నేరస్తుల ఇళ్లు, పలు షాపులు, గడ్డి వాముల్ని సైతం తనిఖీ చేస్తున్నామని తెలిపారు.
అలాగే ఇతర ప్రాంతాల్లో అక్రమ మద్యం, ఆయుధాల రవాణా, పేలుడు పదార్ధాల, డ్రగ్స్, రికార్డులు లేని వస్తువులు, వాహనాలను గుర్తించేందుకు తనిఖీలు చేపడుతున్నట్లు డీజీపీ కార్యాలయం తెలిపింది. ఇందులో భాగంగా కొత్త వారిని, అనుమానిత వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు కూడా వెల్లడించింది. సరైన గుర్తింపు లేని వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నట్లు కూడా తెలిపింది.
votes counting day tension mounts in ap as police hold cordon searches and mock drills
రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న ఈ కార్డన్ సెర్చ్ లు, మాక్ డ్రిల్స్ కు ప్రజలు కూడా సహకరించాలని డీజీపీ కార్యాలయం ఓ ప్రకటనలో కోరింది. అలాగే తమకు అక్రమాలపై ఎలాంటి సమాచారం ఉన్నా వెంటనే స్థానిక పోలీసులకు లేదా డయల్ 112, 100కు తెలియజేయాలని కోరుతున్నారు.