UPDATES  

NEWS

 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై తెలంగాణ సర్కార్ కీలక ఆదేశాలు..!

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం ఆయన సీఎస్ రామకృష్ణారావుతో కలిసి ఇందిరమ్మ ఇళ్లు, నీట్ పరీక్ష ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. ఇందిరమ్మ ఇళ్లకు లబ్ధిదారుల ఎంపికను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితా ఇంఛార్జీ మంత్రులు ఆమోదం పొందాలన్నారు.

 

ఇందిరమ్మ ఇళ్లు విస్తీర్ణం 600 చదరపు అడుగులు మించకూడదని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. ప్రతి నియోజకవర్గంలో పట్టణ ప్రాంతంలో 500 ఇళ్లు నిర్మించాలన్నారు. మే 5 నుంచి 20 వరకు 28 మండలాల్లో భూభారతి సదస్సులు నిర్వహించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లకు అనర్హులని తేలితే ఇళ్ల నిర్మాణం మధ్యలో ఉన్నా సరే రద్దు చేస్తామన్నారు.

 

జాబితా-1, జాబితా-2, జాబితా-3లతో సంబంధం లేకుండా నిరుపేదలను ఎంపిక చేయాలని మంత్రి పొంగులేటి అధికారులకు స్పష్టం చేశారు. మే 4న జరగనున్న నీట్ పరీక్షకు ఏర్పాట్లు చేయాలని అధికారుల్ని ఆదేశించారు. ఈ ఏడాది రాష్ట్రం నుంచి 72,572 మంది విద్యార్థులు నీట్ పరీక్షకు హాజరవుతున్నట్లు తెలిపారు.

 

ఇందుకోసం 24 జిల్లాల్లో 190 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పరీక్ష కేంద్రాల్లో తాగునీరుతోపాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచుకోవాలని అధికారులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచించారు.

 

మరోవైపు, గత కేసీఆర్ పాలనపై మంత్రి పొంగులేటి విమర్శలు గుప్పించారు. కేసీఆర్ పాలనలో మంత్రులకు అధికారం లేదన్నారు. రెవెన్యూ వ్యవస్థను కేసీఆర్ నాశనం చేశారని మండిపడ్డారు. భూభారతిలో త్వరలో కొత్త సాఫ్ట్‌వేర్ రాబోతోందన్నారు. త్వరలో సర్వేయర్ల నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు. జూన్ లో సర్వే మ్యాప్ పైలెట్ ప్రాజెక్టు ద్వారా రిజిస్ట్రేషన్లు చేస్తామన్నారు. ఆరుగురు లైసెన్స్‌డ్ సర్వేయర్లను భర్తీ చేయబోతున్నామని తెలిపారు. ప్రైవేట్ సర్వేయర్లతో భూసర్వే జరిగినా ప్రభుత్వ పర్యవేక్షణ ఉంటుందని మంత్రి పొంగులేటి తెలిపారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |