కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పిలుపుతో శుక్రవారం రాత్రి ఢిల్లీ వెళ్లారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. శనివారం రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ సమావేశం కానున్నారు. గత కొంత కాలంగా మంత్రివర్గ విస్తరణ చర్చలు జరుగుతున్న నేపథ్యంలో వాటిని కొలిక్కి తెచ్చే అంశంపై వీరిద్దరూ భేటీ అవుతున్నారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. కేబినెట్‌లో ఖాళీగా ఉన్న ఆరు స్థానాల భర్తీపై రాహుల్, రేవంత్ మధ్య కీలక చర్చలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
మంత్రివర్గ విస్తరణతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇటివల పూర్తి చేసిన కులగణన, ఎస్సీ వర్గీకరణపై తీసుకున్న నిర్ణయాలు, ఈనెల 16 నుంచి 28 ప్రత్యేక సర్వే, సర్వే పూర్తి అయ్యాక దానికి చట్టబద్దత కల్పించి దానిని కేంద్రానికి పంపించడం, స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా, పీసీసీ కార్యవర్గం ఖరారు, నామినెటెడ్ పోస్టుల భర్తీ తదితర అంశాలపై ఈ సమావేశంలో రాహుల్‌కు రేవంత్ చర్చిస్తారని తెలుస్తోంది. మంత్రివర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఓసీల నుంచి స్థానం కల్పించాల్సి ఉంది.
ఇప్పటికే తెలంగాణ నుంచి వెళ్లిన జాబితాను చివరిసారిగా పరిశీలించి, సీఎం రేవంత్, రాహుల్ చర్చించికుని తుదిరూపు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇవాల్టి సమావేశంలో రాష్ట్ర మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు కల్పించున్నదీ ఖరారయ్యే చాన్స్ ఉంది. ఇక మంత్రివర్గంలో చోటును ఆశించినా దక్కని నిరాశావహులకు రాష్ట్రంలో కీలకమైన కార్పొరేషన్లు, చైర్ పర్సన్లుగా నియమించడం, పీసీసీ రాష్ట్ర కార్యవర్గంలో బాధ్యతలు అప్పజెప్పేలా ఏఐసీసీ నిర్ణయం తీసుకునే చాన్స్ ఉంది.
ఇదిలా ఉంటే.. శుక్రవారం నాడు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన BC కులగణనపై పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాట్లాడారు.
గాంధీ భవన్ లో కులగణనపై పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. అత్యంత ప్రధానమైన రెండు కీలకమైన అంశాలపై కాంగ్రెస్ సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకుందని. తాము చేసిన కులగణనపై లేని పోని అపోహలను సృష్టించి.. తప్పుల తడకగా తేల్చాలని కొందరు తీవ్రంగా యత్నిస్తున్నారనీ అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
నిజం నిప్పులాంటిదని. అది వారినే దహిస్తుంది తప్ప.. ప్రజలకెలాంటి నష్టం జరగదని అన్నారు రేవంత్ రెడ్డి. మహాత్ముడి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని.. దేశ సమగ్రత కోసం రాహుల్ గాంధీ పోరాడుతున్నారు. సోనియా గాంధీ మాట ఇస్తే.. అది శిలా శాసనమని.. ఆనాడు తెలంగాణ ఏర్పాటు చేసి నిరూపించారు. కులగణన చేసి బలహీన వర్గాల జనాభా లెక్క గట్టి వారికి రిజర్వేషన్లు కల్పిస్తామని రాహుల్ గాంధీ మాట ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి సబ్ కమిటీ ఏర్పాటు చేసి కులగణన ప్రక్రియ పూర్తిచేశామని.. అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
సాంకేతికంగా న్యాయపరంగా కులగణనపై నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తామనీ. 150 ఇండ్లను ఒక యూనిట్ గా చేసి ఎన్యుమరేట్లను నియమించి కులగణను నిర్వహించామని అన్నారు రేవంత్ రెడ్డి. కులగణన ప్రకారం 56. 33 శాతం బలహీన వర్గాల లెక్క తేలింది. చెట్ల మీద విస్తర్లు కట్టినట్టు కేసీఆర్ ఆనాడు సమగ్ర కుటుంబ సర్వేకి సంబంధించి కాకి లెక్కలు చూపించారు. కేసీఆర్ లెక్కలు నిజమైతే 52 గా ఉన్న మాదిగ ఉపకులాలు.. 82కి ఎలా మారాయో అర్ధం కావడం లేదని అన్నారు సీఎం రేవంత్.