టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌పై కేసు నమోదు చేశారు సైబరాబాద్ సైబర్ క్రైమ్స్ పోలీసులు. సోషల్‌మీడియాలో టార్గెట్ చేయడంతో పాటు.. బెదిరింపు కాల్స్ వస్తున్నాయని నటి మాధవీలత ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు.. జేసీ ప్రభాకర్‌పై కేసు నమోదు చేశారు. డిసెంబర్ 31 గర్ల్స్ ఈవెంట్‌పై జేసీ, మాధవీలత మధ్య మాటల వివాదం మొదలైంది. అప్పటి నుంచి ఇష్యూ నడుస్తోంది.
కాగా ఇటీవల బీజేపీ నేత సినీ నటి మాధవీ లత ఏపీ టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఫిల్మ్ ఛాంబర్‌లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. సినీ నటులపై ప్రత్యేకించి తనపైన జేసీ ప్రభాకర్ రెడ్డి అసభ్య వ్యాఖ్యలు చేశారనీ.. ఈ నేపథ్యంలో ఆయనపై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు ఆమె. న్యూయర్ సెలబ్రేషన్ సందర్భంగా తాడిపత్రిలో జరిగిన కార్యక్రమాల విషయంలో ఈ వివాదం తలెత్తింది. దీంతో జేసీ ప్రభాకర్ రెడ్డి, మాధవి లత, మరో నేతపై చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి.
అసలేం జరిగిందంటే.. న్యూయర్ సందర్భంగా తాడిపత్రి జేసీ పార్క్‌లో .. జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక ఈవెంట్‌ను నిర్వహించారు. మహిళలకు మాత్రమే ప్రవేశమని ప్రకటించిన జేసీ, తాడిపత్రి మహిళలంతా ఎంజాయ్ చేయాలంటూ సలహా ఇచ్చారు. జేసీ ప్రభాకర్ రెడ్డి నిర్వహించిన ఈవెంట్‌పై యామిని శర్మ, మాధవీలత ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడిపత్రి వంటి సున్నిత ప్రాంతంలో అర్ధరాత్రి వరకు మహిళల కోసం ఇలాంటి ఈవెంట్స్ నిర్వహించడం సరికాదని మాధవిలత కామెంట్స్ చేశారు. బీజేపీ నేతలపై జేసీ ప్రభాకర్ రెడ్డి అసభ్యకరంగా మాట్లాడారు. జేసీ వ్యాఖ్యలకు కలత చెందిన మాధవిలత ఫిలిం చాంబర్ లోని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు ఫిర్యాదు చేశారు.
తన ఫిర్యాదుపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని మాట్ ట్రెజరర్ శివ బాలాజీ చెప్పినట్లు మాధవీలత పేర్కొన్నారు. ఎన్ని విమర్శలు ఎదురైనా జేసీ ప్రభాకర్ రెడ్డి తాను అనుకున్నట్లు గానే న్యూయర్ ఈవెంట్ నిర్వహించారు. తర్వాత ఈవెంట్‌పై విమర్శలు చేసిన మాధవీలతపై జేసీ అసభ్యకరంగా కామెంట్స్ చేశారు. దీంతో జేసీ ప్రభాకర్ రెడ్డిపై మానవహక్కుల సంఘానికి పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు మాధవీలత చెప్పారు. జేసీ తనపై దారుణంగా మాట్లాడారని, వాటిపై ఫిలిం ఇండస్ట్రీ ఖండించలేదని అందుకే మా కు ఫిర్యాదు చేశానన్నారు. సినిమా వాళ్లపై వ్యక్తిత్వ హననం చేస్తూ కామెంట్లు చేయడం సరికాదని ఆమె అన్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా జేసీపై సైబరాబాద్ సైబర్ క్రైమ్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.