UPDATES  

NEWS

 గూగుల్‌తో తెలంగాణ సర్కారు ఒప్పందం.. రైతులకు ఏఐ సేవలు..

రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రంగాల్లో అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ( AI) సామర్థ్యాన్ని ఉపయోగించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్ (Google)తో ఒప్పందం చేసుకుంది. ప్రధానంగా వ్యవసాయం, సుస్థిరాభివృద్ధి, పరిపాలన, రవాణా, విద్య తదితర కీలక రంగాల్లో ఏఐ ఆధారిత సేవలను విస్తృతం చేయనున్నారు.

 

భవిష్యత్తు అవసరాలకు తగిన విధంగా డిజిటల్ నైపుణ్యాలతో శ్రామిక శక్తిని సన్నద్ధం చేసేందుకు వ్యూహాత్మక సహకారం గూగుల్ సంస్థ అందించనుంది. హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలోని టీ-హబ్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ-పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గూగుల్ సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యారు. వారి సమక్షంలో ప్రభుత్వ అధికారులు, గూగుల్ ప్రతినిధులు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు.

 

ఈ ఒప్పందం ప్రకారం గూగుల్ రైతులకు వ్యవసాయ సంబంధిత ఏఐ ఆధారిత పరిష్కారాలు అందించనుంది. రవాణా సదుపాయాలను మెరుగుపరిచే డేటా ఇంటిగ్రేషన్ సదుపాయాల కల్పనలోనూ భాగస్వామ్యం పంచుకుంటుంది. రైతులకు అవసరమైన ఇన్పుట్, రెడిట్, మార్కెటింగ్ సదుపాయాలన్నీ అనుసంధానం చేస్తూ తెలంగాణ ఓపెన్ అగ్రికల్చర్ నెట్‌వర్క్ ను ప్రారంభిస్తుంది.

 

గూగుల్ ఫర్ ఎడ్యుకేషన్ ద్వారా ఏఐ నైపుణ్యాలు పెంపొందించే కార్యక్రమాలపై దృష్టి సారిస్తుంది. ఎంపిక చేసిన పాఠశాలల్లో డిజిటల్ అభ్యసన పద్దతులను ప్రారంభిస్తుంది. గూగుల్ వర్క్ స్పేస్, క్రోమ్ సర్వీసెస్ ను అందిస్తుంది. గూగుల్ డేటా కామన్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఓపెన్ డేటా యాక్సెస్‌ను మెరుగుపరుస్తుంది.

 

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. “ఏఐ ఆధారిత రంగాల్లో గ్లోబల్ లీడర్‌గా ఉండాలన్న తెలంగాణ రైజింగ్ లక్ష్యాలకు గూగుల్ సహకారం ఎంతగానే ఉపయోగపడుతుంది. అత్యాధునిక ఏఐ టెక్నాలజీ ద్వారా కీలక రంగాలలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని లక్ష్యంగా ఎంచుకున్నాం. మెరుగైన పాలన, ఆర్థిక పురోగతితో పాటు ప్రజా సేవలను భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలని అనుకున్నాం. ఈ లక్ష్య సాధనలో గూగుల్‌తో ఒప్పందం

కీలకంగా నిలుస్తుంది’ అని అన్నారు.

 

గూగుల్ ఇండియా కంట్రీ మేనేజర్ ప్రీతి లోబానా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ కీలక రంగాలలో సహకారం అందించటం సంతోషంగా ఉందన్నారు. దేశ డిజిటల్ భవిష్యత్తు పట్ల తమ సంస్థ నిబద్ధతను ఈ నిర్ణయం బలోపేతం చేస్తుందన్నారు

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |