మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి కేంద్ర దర్యాఫ్తు సంస్థ ఈడీ షాకిచ్చింది. పీజీ మెడికల్ సీట్లను అక్రమంగా విక్రయించారనే అభియోగాలపై గురువారం ఈ నోటీసులు ఇచ్చింది. విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసుల్లో పేర్కొంది. దీంతో, మల్లారెడ్డి మెడికల్ కాలేజీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సురేందర్ రెడ్డి అధికారుల ఎదుట హాజరయ్యారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు మల్లారెడ్డి ఇంట్లో సోదాలు జరిగిన విషయం తెలిసిందే.
తెలంగాణలో పలు మెడికల్ కాలేజీలలో పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లను విక్రయించారంటూ గతంలో ఆరోపణలు వెల్లువెత్తాయి. ఫిర్యాదులు రావడంతో ఈడీ రంగంలోకి దిగింది. అందులో భాగంగా గత ఏడాది జూన్‌లో మల్లారెడ్డి నివాసం, మెడికల్ కాలేజీలు, కార్యాలయాలలో ఈడీ సోదాలు నిర్వహించింది.
ఇతర మెడికల్ కాలేజీల్లోనూ ఈడీ సోదాలు చేపట్టింది. ఈ సందర్భంగా కీలక దస్త్రాలను, పెన్ డ్రైవ్‌లు, హార్డ్ డిస్క్‌లను ఈడీ స్వాధీనం చేసుకుంది. తెలంగాణలోని 10 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని 45 సీట్లను బ్లాక్ చేసి విక్రయించినట్లు ఈడీ గుర్తించింది. ఈ నేపథ్యంలో దీనిపై వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది.